ప్రేమ వివాహం చేసుకుని ఇంటికెళ్తుండగా రోడ్డు ప్రమాదం…నవ దంపతులు దుర్మరణం

New couple killed in Road accident : కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. ముడేగామ్ గ్రామానికి చెందిన బట్టు ప్రభాకర్, మహిమలు బైక్ పై కామారెడ్డి వైపు పుంచి వస్తుండగా సదాశివనగర్ లో జూనియర్ కళాశాల వద్ద గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది.
దీంతో మహిమ సంఘటనాస్థలంలోనే మృతి చెందగా మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ కు తరలించారు. అయితే అక్కడ అతను ప్రాణాలు కోల్పోయాడు.
నిన్న వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకుని ఇవాళ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.