టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం, జనసేన-బీజేపీ తరుఫున ప్రచారం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం, జనసేన-బీజేపీ తరుఫున ప్రచారం

Updated On : March 3, 2021 / 4:17 PM IST

tdp ex mla sensational decision: టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున తాను ప్రచారం చేస్తానని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికల తరుణంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిణామాలపై చింతమనేని తీవ్రంగా స్పందించారు. నామినేషన్లు వేసి.. వాటిని విత్‌ డ్రా చేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్న డివిజన్లలో.. బీజేపీ-జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటే.. వారి తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు.

కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కొందరు టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నారని ఆయన సీరియస్ అయ్యారు. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్తు ఉండదన్నారు. టీడీపీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని చింతమనేని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విత్ డ్రా చేసుకున్న టీడీపీ అభ్యర్థుల డివిజన్‌లలో జనసేన, బీజేపీ అభ్యర్థులు ఉంటే వారి తరుపున ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. చింతమనేని ప్రకటనతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గ నేత చింతమనేని ప్రభాకర్ జోక్యం చర్చనీయాంశంగా మారింది.

కాగా, మున్సిపల్ ఎన్నికల తరుణంలో.. పాలక పక్షం వైసీపీకి చెందిన నేతలతో.. ప్రతిపక్షాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పుతున్న సంగతి తెలిసిందే.