Today Headlines: వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. పవన్ కల్యాణ్‌తో హరిరామజోగయ్య భేటీ
వర్తమాన రాజకీయ అంశాలు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు.

Today Headlines in Telugu at 11PM
6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇంఛార్జీలు..
వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పులకు సంబంధించి మూడో జాబితా ఎట్టకేలకు విడుదలైంది. 21మందితో (6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు) థర్డ్ లిస్ట్ ప్రకటించింది వైసీపీ హైకమాండ్. ఇప్పటివరకు 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.
పవన్ కల్యాణ్‌తో హరిరామజోగయ్య భేటీ
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సమావేశమయ్యారు. వర్తమాన రాజకీయ అంశాలు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని హరిరామజోగయ్య అభిలషించారు.
జేబుదొంగల చేతి వాటం
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ జేబులో నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. మరో నేత పర్స్‌ను కూడా కొట్టేశారు జేబు దొంగలు. ఓ నేతకు చెందిన సెల్ ఫోన్ చోరీకి గురైంది.
వైసీపీలో చేరిన తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జి స్వామి దాస్ వైసీపీలో చేరారు. తాడేపల్లి సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి స్వామి దాస్ వెళ్లారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. తిరువూరు వైసీపీ అభ్యర్థిగా స్వామి దాస్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
పెడన, పెనమలూరు అభ్యర్థులను ఫైనల్ చేసిన జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగాల్సి ఉన్న వేళ వైసీపీ నేతలు టికెట్ల విషయంపై ఉత్కంఠ నెలకొంది. కొందరు మంత్రుల స్థానాలు మారుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పెడన, పెనమలూరు నియోజక వర్గాలపై వైసీపీ అధిష్ఠానం నుంచి క్లారిటీ వచ్చేసింది. మంత్రి జోగి రమేశ్ గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి జోగి రమేశ్‌కు పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇచ్చేందుకు ఆయన పేరును సీఎం జగన్ ఫైనల్ చేశారు. ఇక పెడన నుంచి ఉప్పల హారికను బరిలోకి దింపుతున్నారు.
నేను పార్టీ మారను, వైసీపీలోనే ఉంటా: ఎంపీ ఆదాల
తాను పార్టీ మారబోనని, వైసీపీలోనే ఉంటానని ఎంపీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీ, ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోంది.. తాను రూరల్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని, మారే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి చెన్నైకి వెళ్తూ తనను కలిశారని, దీనిపై కూడా లేనిపోని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పులుల మృతి.. విష ప్రయోగంపై దర్యాప్తు ముమ్మరం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లో కే15, ఎస్ 9 అనే రెండు పులుల మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. దరిగాం, షెర్కపల్లి గ్రామాలకు చెందిన నలుగురు పశువుల కాపరులను అటవీశాఖ అధికారులు అదుపులోకి దర్యాప్తు జరుపుతున్నారు. పులులపై విషప్రయోగంపై లోతుగా విచారణ చేస్తున్నారు. గడ్డి మందు, విషం ఎక్కడ కొనుగోలు చేశారనే వివరాలు సేకరించారు. అదుపులో ఉన్న నలుగురు నిందితులతో ఘటనా స్థలంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
టికెట్లపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ప్రకాశం జిల్లా వైసీపీ నేతల టికెట్ల విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై వైసీపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేకపోతోంది. నిన్న మాగుంటతో పాటు బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు. మార్కాపురంతో పాటు గిద్దలూరు, కనిగిరి స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఏదీ ఫైనల్ కాలేదు.
ప్రాజెక్టు పనుల పరిశీలన
సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
నోటిఫికేషన్ వచ్చేసింది..
తెలంగాణ శాసన మండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
19న నామినేషన్లను పరిశీలన.
22న నామినేషన్లు ఉపసంహరణ.
29న ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్.
పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి.
రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. పార్లమెంట్ వారిగా సమీక్షకోసం ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆహ్వానించింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఢిల్లీకి పయనమయ్యారు.
చిరుత సంచారం..
నిర్మల్ జిల్లా పెంచికల్ పహాడ్ శివారులో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లికి ఆహ్వానం..
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును కలిసి తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం హరీశ్ రావు నివాసానికి వెళ్లి పత్రికను అందించారు. తన తనయుడు రాజారెడ్డి పెళ్లికి రావాలని కోరారు. హరీశ్ రావుకు పత్రికను అందిస్తోన్న ఫొటోను షర్మిల తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నా కొడుకు పెళ్లికి ఆహ్వానించానని పేర్కొన్నారు.
గంజాయి పట్టివేత..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ప్రైవేట్ బస్సులను ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తుండగా.. మూడు బస్సుల్లో గంజాయిని అధికారులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
తిరుమల సమాచారం.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుంది. బుధవారం శ్రీవారిని 62,449 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.45కోట్లు సమకూరింది.
జులై 7న నీట్ పీజీ పరీక్ష..
నీట్ పీజీ పరీక్ష జులై 7వ తేదీన జరగనుంది. మార్చి 3వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను జులై 7వ తేదీకి రీ షెడ్యూల్ చేస్తున్నట్లు మెడికల్ సైన్సెస్ జాతీయ పరీక్ష బోర్డు (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. ఈ పరీక్ష రాసే అర్హత కటాఫ్ తేదీని ఆగస్టు 15గా వెల్లడించింది. పీజీ వైద్యవిద్య నిబంధనలు -2023 ప్రకారం ఈ పరీక్ష జరగనుంది.