Today Headlines: తొలి టీ20లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Today Headlines: తొలి టీ20లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి

11PM Headlines

భారత్‌కు ఇంగ్లాండ్ షాక్..
భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ మ‌హిళ జ‌ట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో 38 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 159 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మ‌హిళ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 197 ప‌రుగులు చేసింది.


కేసీఆర్‌పై వెల్లివిరిసిన అభిమానం..

గజ్వేల్ లోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన స్వగ్రామం చింతమడక ప్రజలు కలిశారు. ఇప్పటివరకు కేసీఆర్ ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి సంఘీభావం తెలిపారు. తాజాగా కేసీఆర్ స్వగ్రామం చింతమడక ప్రజలు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలియజేశారు. కేసీఆర్ వారందరికీ అభివాదం తెలిపారు. కేసీఆర్ ను చూసేందుకు అక్కడికి వచ్చిన జనం.. ఆయనపై తమకున్న అభిమానం చాటుకున్నారు. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఇదే నా ఆహ్వానం- రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ”రేపు ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం” అని ఆ లేఖలో ఉంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.

మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ను హెచ్చరించిన ఏఐ సైంటిస్ట్
ఏఐ చాట్‌జీపీటీ వేగాన్ని అందుకునేలా సొంత ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకపోతే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదని కంపెనీ టాప్ ఏఐ శాస్త్రవేత్త ఒకరు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను హెచ్చరించారు. మెటా త్వరలో సొంత ఏఐ అసిస్టెంట్‌లో పనిచేయడం ప్రారంభించకపోతే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మనుగడకే ముప్పు వాటిల్లి అంతరించిపోయే అవకాశం ఉందన్నారు.

సీఎంగా రేవంత్ రెడ్డి.. ఏపీలో సెలబ్రేషన్స్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో భీమవరంలో హడావిడి నెలకొంది. రేవంత్ రెడ్డి వియ్యంకుడు ఇంటి వద్ద పెద్దఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు బంధువులు, కాలనీవాసులు. రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి.. భీమవరంకు చెందిన రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ కంపెనీ అధినేత వెంకట్ రెడ్డికి కోడలు అవుతుంది.

దేశంలో ఒక్క చోటే ఓటు ఉండాలనేది వైసీపీ విధానం- మంత్రి జోగి రమేశ్
ఏపీ మంత్రులు, పలువురు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాను కలిశారు. మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నేతలు సీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఏపీలో 4లక్షల 30వేల 264 ఓట్లు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు అందించామన్నారు.

డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరామన్నారు మంత్రి జోగి రమేశ్. దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం అని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి బోగస్ ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని సీఈవోని కోరామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమని ఫిర్యాదు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

పోరాటాలు మాకేం కొత్త కాదు- కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు ఎమ్మెల్యే కేటీఆర్. రకరకాల ప్రలోభాలు పెట్టినా కుట్రలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారు అని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం సహజం అని నిరాశ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. పోరాటాల నుంచి వచ్చిన పార్టీ మాది, పోరాటాలు మాకేం కొత్త కాదన్నారు. వారు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన ప్రజలు గొంతుకై మాట్లాడతామన్నారు. పవర్ పాలిటిక్స్ లో అధికారం రావడం పోవడం సహజం అన్నారు కేటీఆర్. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామని, ప్రజల గొంతుకై మాట్లాడతామని స్పష్టం చేశారు.


రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ట్విస్ట్

రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం ఢిల్లీ పర్యటనలో బీజీబిజీగా గడిపిన ఆయన హైదరాబాద్ వచ్చేందుకు మధ్యాహ్నం తర్వాత ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావు ఠాక్రేను కలవలేదన్న విషయం గుర్తుకు రావడంతో రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి వచ్చారు. మహారాష్ట్ర సదన్ లో మాణిక్‌రావు ఠాక్రేను కలిసి తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

కుట్రతో కాంగ్రెస్ గెలిచింది..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా రాజకీయం జరిగిందని, అది పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేసిందని వ్యాఖ్యానించారు. కుతంత్రాలతో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీయే అంటూ ఆరోపించారు.

మోసాల కాంగ్రెస్..
కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు అంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదంటూ విమర్శలు సంధించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కవ కాలం ఉండదని..కేవలం ఆరు నెలలు లేదా ఏడాది మాత్రమే ఉంటుంది అంటూ రాజాసింగ్ జోస్యం చెప్పారు.

గవర్నర్ కు హస్తం నేతల లేఖ..
గవర్నర్‌ తమిళిసైని కాంగ్రెస్ నేతలు కలిసారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నామని ఎమ్మెల్యేల సంతకాలతో లేఖను అందజేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను నేతలు కోరారు.

బాబుతో పవన్ భేటీ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా వీరు తాజా రాజకీయాలపై చర్చించారు.

విచారణ వాయిదా..
టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇసుక ఉచిత పాలసీ, ఐఆర్ఆర్ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణపై ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సీఐడీ సమయం కోరడంతో వాయిదా వేసిన న్యాయస్థానం.

పార్లమెంట్ రేవంత్ ..
రేవంత్ రెడ్డి బుధవారం పార్లమెంట్ కు వెళ్లారు. మల్కాజిగిరి నియోజకవర్గం ఎంపీగా రేవంత్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా రేవంత్ విజయం సాధించడం, రేపు సీంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బుధవారం రేవంత్ పార్లమెంట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ ఛాంబర్ లో రేవంత్ కు ఎంపీల అభినందనలు తెలిపారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ కు మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.

జగన్, స్టాలిన్ కు ఆహ్వానం..
తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. వీరితోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానాలు వెళ్లినట్లు సమాచారం. వీరితోపాటు తెలంగాణ ఉద్యమకారులు కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్యతో పాటు మరికొందరు ఉద్యమకారులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానాలు వెళ్లినట్లు తెలిసింది.

డిప్యూటీకోసం నేతల పట్టు..
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, డిప్యూటీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం పదవికోసం కాంగ్రెస్ అధిష్టానం వద్ద నేతలు పట్టుబడుతున్నట్లు తెలిసింది. బీసీ, మైనార్టీ నేతల నుంచి డిప్యూటీ పదవికోసం డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.

తెలంగాణలో వర్షాలు..
మిగ్‌జామ్‌ తీవ్ర తుపాను తీరందాటింది. తీరందాటినా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణలో మరో రెండ్రోజులు పాటు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

‘మైక్రోసాఫ్ట్ 365 యాప్‌ ..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోస్టాప్ట్ ప్రతి ఒక్కరికి సాప్ట్‌వేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఐడీసీని ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో హైదరాబాద్ క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు చీఫ్‌ గెస్ట్‌గా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హజరయ్యారు. ‘మైక్రోసాఫ్ట్ 365 అనే యాప్‌ని ఇటీవలే ప్రారంభించిందని ఎండీ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. అందులో ఏదైనా ఇమేజ్ రూపంలో ఉన్న టెక్స్ట్‌ని ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్స్ట్ ఫార్మాట్‌లోకి మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతుందని అన్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుందని తెలిపారు.

ఈవీఎంలపై అనుమానం..
ఈవీఎంల ఫలితాలపై కాంగ్రెస్‌ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌ ఫలితాలపై కాంగ్రెస్ నాయకుడు కమలనాథ్‌ అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాంగ్రెస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తమ గ్రామాల్లో 50 ఓట్లు కూడా పోల్ కాలేదంటున్నారని కమల్‌నాథ్‌ వెల్లడించారు. ఎమ్మెల్యేకు సొంతూరిలో 50ఓట్లు కూడా పడకపోవడంపై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. నియోజకవర్గంలో ఓడినా సొంతూరిలో కచ్చితంగా మెజార్టీ వస్తుందన్నారు. మరి ఎందుకలా జరిగిందో ఈవీఎంలకే తెలుసన్నారు. ఈవీఎంల‌పై కాంగ్రెస్ రాజ్యస‌భ ఎంపీ దిగ్విజ‌య్ సింగ్ కూడా సందేహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చిప్ ఉన్న ఏ మెషీన్‌ను అయినా హ్యాక్ చేసే అవకాశముందని సంచలన ఆరోపణలు చేశారు.

డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు ..
డీఎంకేకు చెందిన ఎంపీ డీఎన్‌వీ సెంథిల్‌ కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిపై BJP తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్‌ సైతం సెంథిల్‌ వ్యాఖ్యలను తప్పుబట్టింది. దీంతో సెంథిల్‌ కుమార్‌ క్షమాపణ చెప్పారు.

ఇండియా సమావేశం వాయిదా ..
ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ఇవాళ ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి జరగాల్సి ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయన్న ప్రచారం నేపథ్యంలో…. ఇవాళ్టి ఇండియా కూటమి సమావేశం వాయిదా వేశారు. ఈ నెల మూడోవారంలో అందరికీ కుదిరిన తేదీన కమిటీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం ఈ నెల 17వ తేదీన జరుగుతుందని ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు.

సొరంగాల్లోకి నీరు..
ఇజ్రాయెల్‌ దళాలకు గాజాలో పెద్ద తలనొప్పిగా మారిన హమాస్‌ సొరంగాలను నీటితో నింపేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ వ్యూహం ఫలిస్తే.. సొరంగాల్లో నక్కిన హమాస్‌ దళాలు మొత్తం ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఇజ్రాయెల్‌ అంచనావేస్తోంది. తాజాగా ఈ వ్యూహంలో భాగంగా ఐడీఎఫ్‌ దళాలు భారీ నీటి పంపులను సొరంగాల వద్దకు చేరుస్తున్నాయి.