Today Headlines: వైసీపీ పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?: చంద్రబాబు
జగన్ సీఎం అయ్యాక ఏపీని విధ్వంసం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు.

చంద్రబాబు విమర్శలు
జగన్ సీఎం అయ్యాక ఏపీని విధ్వంసం చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతేమో వెలవెలబోతుందని చెప్పారు. వైసీపీ పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కదిలి రావాలని చెప్పారు. రాష్ట్రంలోని వ్యవస్థలను జగన్ నాశనం చేశారని అన్నారు. వైసీపీ పాలనలో ఆక్వారంగం కుదేలైందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా కాలువల్లో పూడిక తీశారా? అని అన్నారు.
కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్ దంపతులు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ పరామర్శించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి నరసింహన్ దంపతులు వెళ్లారు. నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య వివరాలను నరసింహన్ తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో నరసింహన్ కాసేపు మాట్లాడారు.
అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్
వైసీపీని వీడాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను అంబటి రాయుడిని… జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు’ అని పేర్కొన్నారు.
ఉత్తమ్ తో తుమ్మల..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఉత్తమ్ ను కోరారు. అంతకుముందు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గానికి నీరు ఇచ్చే అంశంపై మంత్రులు సమీక్షించారు.
ఏపీ ప్రజలకు చంద్రబాబు పిలుపు..
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30ఏళ్లు వెనక్కిపోయింది.. మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని సీఎం జగన్ దెబ్బతీశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదలి రావాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా కదలి రా’ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. మరోపక్క అమరావతి వెలవెలబోతుందని, దీనికి కారణం జగన్ రివర్స్ పాలన అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు.
వైభవంగా కల్యాణ మహోత్సవం ..
భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర పర్యవేక్షణలో బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో మల్లికార్జునుడి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గాయకులను ప్రశంసించిన మోదీ..
అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్న నేపథ్యంలో ప్రముఖ జానపద గాయని గీతా రబారీ ఆలపించిన భక్తి గీతాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా గాయకులను ప్రధాని ప్రశంసించారు. రాముడికి స్వాగతం పలుకుతూ గీతా రబారీ ఆలపించిన గీతం ఎంతో భావోద్వేగంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు.
రోడ్డు ప్రమాదం..
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్లలో రోడ్డుప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. టీఎస్ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.
తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లు లేకుండా సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 68,793 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు వచ్చింది.
విశేష స్పందన ..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి పది రోజులపాటు సాగిన అభయహస్తంకు.. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంతా 12,171 గ్రామ పంచాయతీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కోటి 8 లక్షల 94 వేల దరఖాస్తులు అందాయి.
దీక్షల విరమణలు..
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు నేటితో ముగియనున్నాయి. భవానీ దీక్షాధారులు అమ్మవారిని శనివారం భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం నేటితో దీక్షా విరమణలు ముగియనున్నాయి. ఈ నెల 3న భవానీ దీక్షల విమరణ క్రతువు ప్రారంభమైన విషయం తెలిసిందే.