Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు.

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పూరీ జగన్నాథ్ విచారణలో కీలక విషయాలు

Puri Jaganath

Updated On : August 31, 2021 / 10:16 PM IST

ED investigated Puri Jagannath : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రశ్నించారు. పూరీ బ్యాంక్ అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటలకు క్వశ్చన్ అవర్ సాగింది. పూరీ జగన్నాథ్ స్టేట్ మెంట్ అధికారులు నమోదు చేసుకున్నారు. పూరీ జగన్నాథ్ తోపాటు అతని చార్టెడ్ అకౌంటెంట్ ను విచారించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ జరిగింది.

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సివుంటుందని తెలిపింది. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని అధికారులు పూరీకి తెలిపారు. పూరీ జగన్నాథ్ బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. మూడు బ్యాంక్ అకౌంట్స్ స్టేట్ మెంట్స్ ను పరిశీలించారు.

2015 నుంచి అకౌంట్స్ స్టేట్ మెంట్స్ ను పరిశీలించారు. చార్టెడ్ అకౌంటెంట్ సమక్షంలో ఈడీ అధికారులకు పూరీ జగన్నాథ్ వివరించారు.
డైరెక్టర్ గా పూరీ, నిర్మాతగా బండ్ల గణేష్ తీసిన పలు సినిమాలపై ఆరా తీశారు. గతంలో పూరీతో ఇద్దరు అమ్మాయిలతో, టెంపర్ సినిమాలను బండ్ల గణేష్ నిర్మించారు. సినిమాల నిర్మాణ సమయంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. పూరీ నుంచి ఆడిట్ రిపోర్ట్ వివరాలు సేకరించారు.

ఆఫ్రికా దేశానికి సంబంధించిన ముగ్గురు ఫోటోలను పూరి జగన్నాథ్ కు ఈడి అధికారులు చూపెట్టారు. ఈ ముగ్గురు తెలుసా అని పూరిని అడిగారు. తనకు తెలియదంటూ పూరి అధికారులకు సమాధానం ఇచ్చారు. ఆఫ్రికా దేశానికి సంబంధించిన రెండు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై ఈడి అధికారులు ఆరా తీశారు.

ఆఫ్రికా దేశానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు డబ్బులు చెల్లించిన దానిపై ఈడికి పూరి వివరణ ఇచ్చారు. సినిమా షూటింగ్ కోసమే ఆ లావాదేవీలు జరిపినట్లుగా పూరి జగన్నాధ్ సమాధానం ఇచ్చారు. ఆ వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని పూరిజగన్నాథ్ ను ఈడి అధికారులు కోరారు. రెండు లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలు ఇస్తానని పూరి జగన్నాథ్ చెప్పారు.

డ్రగ్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ ఈడీ ఆఫీస్ కు రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. సుమారు 2 గంటలపాటు బండ్ల ఈడీ కార్యాలయంలో ఉన్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్ల ఆధారంగా బండ్ల గణేష్ ను విచారణకు పిలిచినట్లు సమాచారం.

పూరీ చెప్పిన లెక్కల ఆధారంగా బండ్ల గణేష్ ను అధికారులు ప్రశ్నించారు. అమ్మతోడు నాకేం తెలియదని చెప్పినప్పటికీ ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. ఈడీ అధికారులు పిలవలేదు…పూరీని కలవడానికే వచ్చానని బండ్ల గణేష్ తెలిపారు.