ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూత

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూశారు ఆయన వయస్సు 57 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు.
ఆయన గత కొన్నేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. హరికిషన్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు గుజరాత్ లోనూ మరోకరు ఆస్ట్రేలియాలోను ఉంటున్నారు. కుమారులు వచ్చేంత వరకు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే భద్రపరచనున్నారు.
1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే తన గురువులను, తోటి స్నేహితుల గొంతులను మిమిక్రీ చేయడం ప్రారంభించారు. పలువురు సినీ, రాజకీయ నాయకులు వాయిస్‌ను మిమిక్రీ చేసి హరికిషన్ బాగా ప్రాచుర్యం పొందారు. ఆయన మిమిక్రీకి ఎంతో మంది ముగ్ధులు కాగా, సెలబ్రిటీలు కూడా అతని ప్రావీణ్యానికి దాసోహం అన్నారు.
హరికిషన్ కేవలం మిమిక్రీ మాత్రమే కాక పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలికించారు. 1971లో విజయవాడలో హరికిషన్ తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు.
దివంగత మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ స్ఫూర్తితో హరికిషన్ మిమిక్రీ రంగంలోకి వచ్చారు. దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన హరికిషన్ ప్రముఖ నటుడు శివారెడ్డికి గురువు కూడా. మిమిక్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న హరికిషన్ మృతి తెలుగు వారికి తీరని విషాదాన్ని మిగిల్చింది. హరికిషన్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Read: వాణిశ్రీ కొడుకుది గుండెపోటు కాదట..ఆత్మహత్య..?!