Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు కెరీర్ మలుపు తిప్పిన సినిమా.. కోట కోసం రామానాయుడుతో జంధ్యాల గొడవ..
అసలు ఆ పాత్ర కోట శ్రీనివాసరావు చేయాల్సింది కాదట.

Kota Srinivasa Rao
Kota Srinivasa Rao : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు నేడు తెల్లవారుజామున మరణించారు. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంనెలకొంది. అనేకమంది సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు పాత విషయాలు వైరల్ గా మారాయి.
1978లో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కోట శ్రీనివాసరావు 1985 నుంచి రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు. అయితే కోట శ్రీనివాసరావు కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం 1987 లో వచ్చిన అహ నా పెళ్ళంట సినిమానే. జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పిసినారి పాత్రలో కనిపించి బ్రహ్మానందంతో కలిపి అందర్నీ నవ్వించి అదరగొట్టారు. ఆ సినిమాతో కోట శ్రీనివాసరావు స్టార్ ఆర్టిస్ట్ అయిపోయారు.
అయితే అసలు ఆ పాత్ర కోట శ్రీనివాసరావు చేయాల్సింది కాదట. నిర్మాత రామానాయుడు కూడా కోటని వద్దన్నారు. కానీ జంధ్యాల ఈ విషయంలో పట్టుబట్టి మరీ ఆయనతో వాదులాడి కోట శ్రీనివాసరావుని తీసుకున్నారు.
గతంలో కోట శ్రీనివాసరావు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అహ నా పెళ్ళంట సినిమాలో ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. ఒకరోజు ఎయిర్ పోర్ట్ లో రామానాయుడు కలిశారు. అప్పట్లో నా లాంటి నటుడు ఆయనకు ఎదురుగా కూర్చొని మాట్లాడటం అంటే గొప్ప విషయం. అలాంటిది ఆయన నీతో మాట్లాడాలి రా అని పిలిచారు. జంధ్యాలతో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. అది పండితే సినిమా బాగా ఆడుతుంది. లేకపోతే యావరేజ్. నేను ఆ పాత్రను రావు గోపాలరావుతో వేయిద్దామనుకుంటున్నాను. కానీ జంధ్యాలేమో నువ్వే కావాలని పట్టుబట్టాడు. దీని గురించి నేను, జంధ్యాల 20 రోజులుగా చర్చించుకుంటున్నాము. 20 రోజులు నీ డేట్స్ కావాలి అని అడిగారు. దానికి నేను ఓకే చెప్పాను. ఆ సినిమా పెద్ద హిట్ అయి నా పాత్రకు మంచి పేరు తెచ్చింది అని తెలిపారు.
Also Read : Kota Srinivasa Rao : సోషల్ మీడియా వేదికగా కోట శ్రీనివాసరావుకు సినీ ప్రముఖుల నివాళి.. ఎవరెవరు ఏమన్నారు అంటే..