Game Changer Movie Review : ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ.. శంకర్, చరణ్ కాంబో వర్కౌట్ అయిందా?
ప్రతి సీన్ లో శంకర్ విజువల్స్, భారీతనం కచ్చితంగా కనిపిస్తుంది.

Ram Charan Shankar Anjali Game Changer Movie Review and Rating Here
Game Changer Movie Review : రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నేడు జనవరి 10న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కియారా అద్వానీ(Kiara Advani), అంజలి, SJ సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. రామ్ నందన్(రామ్ చరణ్) IPS నుంచి IAS గా మారి కలెక్టర్ గా వైజాగ్ జిల్లాకు వస్తాడు. సమాజంలో మంచి ఉండాలని అన్ని పర్ఫెక్ట్ రూల్స్ తోనే అవినీతిపరులు, రౌడీల ఆట కట్టించే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(SJ సూర్య)కు శత్రువు అవుతాడు. మోపిదేవి తన తండ్రి, సీఎం బొబ్బిలి సత్యమూర్తి(శ్రీకాంత్) చనిపోతే సీఎం అవుదామని ఎదురుచూస్తూ ఉంటాడు. రామ్ నందన్ ఓ పక్కన తన జాబ్ చేస్తూ కాలేజీలో తనను వదిలేసి వెళ్లిపోయిన దీపికా(కియారా అద్వానీ)ని కనిపెట్టి మళ్ళీ ఆమెతో ప్రేమాయణం నడిపిస్తాడు.
దీపికా ఆశ్రమంలో ఉన్న పార్వతమ్మ(అంజలి)ని సీఎం సభకు తీసుకెళ్లడంతో సీఎం ఆమెను, కలెక్టర్ రామ్ నందన్ ని చూసి షాక్ అవుతాడు. పార్వతమ్మ స్టేజిపై ప్రజల ముందే సీఎంని, మినిస్టర్ ని తిడుతుంటే ఆ గొడవలో రామ్ నందన్ మోపిదేవిపై చెయ్యి చేసుకుంటాడు. దీంతో రామ్ నందన్ సస్పెండ్ అవుతాడు. అదే సమయంలో మోపిదేవి తన తండ్రిని చంపేసి సీఎంగా అనౌన్స్ చేసుకుంటాడు. కానీ చనిపోయేముందు సీఎం సత్యమూర్తి ఓ వీడియో చేసి.. రామ్ నందన్ తన వారసుడు అని, తనే సీఎం అవ్వాలని చెప్తాడు. మరి రామ్ నందన్ సీఎం అయ్యాడా? మోపిదేవి సీఎం అయ్యాడా? రామ్ నందన్ సస్పెన్షన్ ఎత్తేసారా? సీఎం రామ్ నందన్ ని తన వారసుడుగా ఎందుకు ప్రకటించాడు? పార్వతమ్మ – అప్పన్న(రామ్ చరణ్) ల కథేంటి? మోపిదేవి – రామ్ నందన్ మధ్య గొడవలు ఎంతవరకు వెళ్లాయి? దీపికా రామ్ ని ఎందుకు వదిలి వెళ్ళింది? దీపికా – రామ్ పెళ్లి జరిగిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Game Changer : రేపే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్.. వీళ్లందరి గేమ్ మారుస్తుందా ?
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ రామ్ నందన్ వచ్చి కలెక్టర్ గా మంచి పనులు చేయడం, మోపిదేవితో శత్రుత్వం, మరోపక్క దీపికాతో ప్రేమాయణం, పార్వతమ్మ పాత్ర పరిచయంతో సరిపోతుంది. ఇంటర్వెల్ కి సీఎం రామ్ నందన్ తన వారసుడు అనే ట్విస్ట్ తో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో అప్పన్న పాత్రతో సాగుతుంది. మళ్ళీ రామ్ నందన్ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు, ఏం చేసాడు అని రామ్ నందన్ – మోపిదేవి మధ్య ఎత్తుకు పై ఎత్తుకు అన్నట్టు సాగుతుంది.
గతంలో శంకర్ సినిమాల్లో గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకుల చుట్టూ జరిగేవి. రోబో సినిమా నుంచి తన పద్ధతి మార్చిన శంకర్ మళ్ళీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో తన పాత రూట్లోకి వెళ్ళాడు. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగి తలుచుకుంటే ఏం చేయగలడు అని రాజ్యంగంలో ఉన్న అన్ని రూల్స్ తో చరణ్ పాత్రను పర్ఫెక్ట్ గా చూపించారు. చరణ్ కి ఓపెనింగ్ సీన్ నుంచి చివరి వరకు స్టైలిష్ గా కావాల్సినన్ని ఎలివేషన్స్ ఇచ్చారు. అయితే శంకర్ పాత సినిమాల్లో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా మెసేజ్ కచ్చితంగా ఉంటుంది.
ఫస్ట్ హాఫ్ లో కాస్త బోర్ కొట్టినా ప్రీ క్లైమాక్స్ నుంచి కథ దూసుకుపోతుంది. ఓపెనింగ్ శ్రీకాంత్ పాత్ర సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో అప్పన్న – పార్వతి పాత్రల ఫ్లాష్ బ్యాక్ సెటప్ అంతా బాగుంటుంది కానీ దాన్ని త్వరగా ముగించేయడంతో కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే రామ్ నందన్ చిన్నప్పుడు మిస్ అయి ఏమయ్యాడు? ఇప్పటి తల్లి తండ్రులకు ఎలా దొరికాడు అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ప్రీ క్లైమాక్స్ లో అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. సూపర్ హిట్ అయిన మెలోడీ ‘నానా హైరానా..’ సాంగ్ సినిమాలో లేకపోవడం అభిమానులకు నిరాశే. సినిమాలో ప్రతి సీన్ లో శంకర్ విజువల్స్, భారీతనం కచ్చితంగా కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే శంకర్ పాత శైలీలో పర్ఫెక్ట్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా సినిమా. అయితే ఇప్పటి జనరేషన్ కి ఈ ఓల్డ్ స్టైల్ మెసేజ్ కమర్షియల్ సినిమా నచ్చుతుందా అనేది ప్రశ్నార్థకమే.
నటీనటుల పర్ఫార్మెన్స్.. రామ చరణ్ రామ్ నందన్ పాత్రలో చాలా స్టైలిష్ గా, అప్పన్న పాత్రల్లో హుందాతనంగా మెప్పించాడు. రెండు పాత్రల్లోనూ ఎమోషనల్ సీన్స్ లో చరణ్ జీవించేసాడు అని చెప్పొచ్చు. అప్పన్న పాత్రకు నత్తి ఉండటంతో దానికోసం చరణ్ బాగా కష్టపడ్డాడు. ఇక అంజలి కూడా అప్పన్న భార్య పాత్రతో పాటు ముసలి పాత్రలో ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తుంది. కియారా తన అందాలతో అలరిస్తుంది. నట రాక్షసుడు అని పిలుచుకునే SJ సూర్య ఈ సినిమాలో కూడా తన నటనతో మరోసారి వావ్ అనిపిస్తాడు.
సీఎంగా, ముసలి పాత్రలో శ్రీకాంత్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. జయరాం అక్కడక్కడా నవ్విస్తాడు. బ్రహ్మానందం చిన్న సీన్ లో కనిపించి నవ్విస్తారు. నవీన్ చంద్ర కూడా నెగిటివ్ రోల్ లో రౌడీ పాత్రలో బాగానే సూట్ అయ్యాడు. సముద్రఖని, రాజీవ్ కనకాల,సునీల్, వైవా హర్ష, అనన్య, విశ్వంత్, ప్రియదర్శి, సుదర్శన్, నరేష్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు నటీనటులు చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.
Also Read : Game Changer Song : గేమ్ ఛేంజర్ ‘అన్‌ప్రెడిక్టబుల్..’ సాంగ్ రిలీజ్.. స్టైలిష్ గా ఉందిగా.. విన్నారా?
సాంకేతిక నిపుణులు.. సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ విజువల్స్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. శంకర్ సినిమాలో సెట్స్, బ్యాక్ గ్రౌండ్ భారీగా ఉంటాయని తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి పర్ఫెక్ట్ గా ఆ కాలానికి తగ్గట్టు అన్ని సెట్ చేశారు. జరగండి సాంగ్ లో సెట్ అయితే అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక తిరు అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా క్వాలిటీగా, రిచ్ గా ఉన్నాయి. లొకేషన్స్ సెట్స్ తో పాటు వైజాగ్ లో చాలా రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేసారు. కార్తీక్ సుబ్బరాజు ఓ పాత కథకే చిన్న ఛేంజెస్ చేసి కొత్తగా చూపించారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) మాత్రం అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు. ఎలివేషన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోను తమన్ మ్యూజిక్ మెప్పిస్తుంది. సాంగ్స్ శంకర్ విజువల్స్ తో, తమన్ మ్యూజిక్ తో వినడానికి చూడటానికి బాగున్నాయి. అరుగు మీద సాంగ్ కొన్నాళ్లపాటు గుర్తుండిపోతుంది. సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ బాగుంటాయి. ఇక దర్శకత్వం పరంగా శంకర్ కి వంక పెట్టాల్సిన పనిలేదు. ఆయన స్టైల్ లో భారీగా పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా చూపించారు. నిర్మాణ పరంగా దిల్ రాజు చెప్పినట్టే భారీగా పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
మొత్తంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా డైరెక్టర్ శంకర్ తన పాత స్టైల్ లోకి వెళ్లి తీసిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.