కరోనా కలిపింది ఇద్దరినీ..
కరోనా ఎఫెక్ట్ : పిల్లల కోసం కొద్దిరోజులు కలిసుండాలని నిర్ణయించుకున్న హృతిక్, సుసానే దంపతులు..

కరోనా ఎఫెక్ట్ : పిల్లల కోసం కొద్దిరోజులు కలిసుండాలని నిర్ణయించుకున్న హృతిక్, సుసానే దంపతులు..
గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఓ బాలీవుడ్ జంటకు మాత్రం మంచే చేసింది. గతంలో విడిపోయిన వాళ్లిద్దరినీ మళ్లీ ఒక దగ్గరకు చేర్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 14 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తన భార్య సుసానే ఖాన్ నుంచి 2014లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయినా తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. హృతిక్ పిల్లల్ని హాలీడే టూర్లకు తీసుకెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
ప్రస్తుతం కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో తమ పిల్లల కోసం హృతిక్, సుసానే ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలు హ్రేహాన్, హృదాన్‌కు అండగా నిలిచేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హృతిక్ వెల్లడించాడు. ఈ 21 రోజులు తామందరం కలిసే ఉంటామని తెలిపాడు.
‘కొద్ది రోజులుగా సుసానే మా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది. పిల్లల పట్ల తన ప్రేమకు ఇది నిదర్శనం. తల్లిదండ్రులగా మన బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి, కో-పేరెంటింగ్‌లో నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ సుసానే’ అంటూ హృతిక్ కామెంట్ చేశాడు. విపత్కర సమయంలో పిల్లల కోసం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్న హృతిక్, సుసానే మంచి తల్లిదండ్రులు అంటూ నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.