Constable Kanakam Season 2 : ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ.. చంద్రిక ఏమైంది..?

తాజాగా కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(Constable Kanakam Season 2)

Constable Kanakam Season 2 : ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ.. చంద్రిక ఏమైంది..?

Constable Kanakam Season 2

Updated On : January 9, 2026 / 3:01 PM IST

Constable Kanakam Season 2 : వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 1 గత సంవత్సరం ఆగస్టులో రిలీజయింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కింది. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా సీజన్ 2 ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(Constable Kanakam Season 2)

కథ విషయానికొస్తే..

సీజన్ 1లో రేపల్లె అనే ఓ గ్రామంలో కనకం (వర్ష బొల్లమ్మ) కానిస్టేబుల్ గా జాబ్ చేస్తుంది. ఆ ఊళ్ళో అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్న కేసుని తను పర్సనల్ గా తీసుకొని ఎంక్వేరి చేసి ఇదంతా చేస్తుంది ఆ ఊరి ప్రసిడెంట్(అవసరాల శ్రీనివాస్) అని కనిపెడుతుంది. అయితే చివరగా తన క్లోజ్ ఫ్రెండ్ చంద్రిక మిస్ అవుతుంది. అక్కడితో సీజన్ 1 ఆపేసి చంద్రిక ఏమైంది అని సెకండ్ సీజన్ కి లీడ్ ఇచ్చారు.

సీజన్ 2 లో కథ అక్కడనుంచే మొదలవుతుంది. అసలు చంద్రిక ఏమైంది అని తెలుసుకోవడానికి ఆమె గురించి ఆరా తీస్తూ ప్రయాణం మొదలుపెడుతుంది కానిస్టేబుల్ కనకం. ఈ క్రమంలో చంద్రిక కి ఒక కవల చెల్లి ఉందని, చంద్రిక దత్తత కూతురు అని తెలుస్తుంది. అదే సమయంలో కానిస్టేబుల్ కనకం తండ్రి మరణిస్తాడు. మరి చంద్రిక ఎవరు? చంద్రిక చెల్లి ఎవరు? అసలు చంద్రిక ఏమైంది? ఎవరి దగ్గర్నుంచి చంద్రిక పేరెంట్స్ దత్తత తీసుకుంటారు? ఈ కేసుని కనకం ఎలా డీల్ చేసింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : The Raja Saab Review : ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ.. హారర్ సినిమా అన్నారు.. కానీ..

సిరీస్ విశ్లేషణ..

కానిస్టేబుల్ కనకం సిరీస్ మొదటి సీజన్ ఆరు ఎపిసోడ్స్ ఉండగా బాగా సాగదీసి సాగదీసి కథని నడిపించారు. ఇప్పుడు సీజన్ 2 నాలుగు ఎపిసోడ్స్ ఉంది. ఈ సీజన్ చూస్తే షూటింగ్ మొత్తం ఒకేసారి చేసేసారు, ఇదంతా ఒకే కథ కానీ కావాలనే ప్రమోషన్స్, హైప్ కోసం రెండు సీజన్స్ కుండా రిలీజ్ చేసారు అని తెలిసిపోతుంది.

ఇక సెకండ్ సీజన్ కూడా సాగదీస్తూ ఏమి లేకపోయినా ఏదో ఉందనేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ నడిపించారు. చంద్రికని చూపెట్టగానే కవలపిల్లలు అనే ట్విస్ట్ ఈజీగా తెలిసిపోతుంది. చంద్రిక దత్తతకు సంబంధించిన ట్విస్ట్, ఓ పాత్ర విలన్ అవ్వడం అసలు ఊహించలేము. క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే ఊహించేయొచ్చు. చివర్లో కాస్త ఎమోషన్ వర్కౌట్ చేసారు. ఒక సీజన్ నే సాగదీసి రెండు సీజన్స్ చేశారనుకుంటే మళ్ళీ చివర్లో సీజన్ 3 కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

Constable Kanakam Season 2

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఫస్ట్ సీజన్ లో అమాయకంగా కనిపించి చివర్లో ధైర్యంగా మారే కానిస్టేబుల్ పాత్రలో వర్ష బొల్లమ్మ సెకండ్ సీజన్ లో అదే ధైర్యంతో తన ఫ్రెండ్ కోసం ఎంతకైనా తెగించే పాత్రలో బాగా నటించింది. చంద్రిక పాత్రలో నటించిన మేఘలేఖ డ్యూయల్ రోల్ లో అదరగొట్టేసింది. రాజీవ్ కనకాల, సౌమ్య.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Constable Kanakam : ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఊళ్ళో అమ్మాయిలు మిస్సింగ్..

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సింపుల్ సీన్స్ ని కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఏదో ఉందనేలా బాగా ఎలివేట్ చేసారు. సీజన్ 1 లోనే ముగించాల్సిన కథని ఇంకాస్త సాగదీసి ఇప్పుడు సీజన్ 2 లో చెప్పినా ఈ పార్ట్ వరకు కథ, కథనం ట్విస్టులతో బాగానే రాసుకున్నారు. సీజన్ 1 లాగే సీజన్ 2 లో కూడా ఉన్న చాలా ల్యాగ్ సీన్స్ ని ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ సీజన్ 2 మొదటి సీజన్ కి కొనసాగింపుగా సాగిన థ్రిల్లర్ సిరీస్. ఒక సారి ఫార్వార్డ్ చేసుకుంటూ చూడొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.