Madha Gaja Raja : ‘మద గజ రాజ’ మూవీ రివ్యూ.. 12 ఏళ్ళ క్రితం సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..
విశాల్ అప్పుడెప్పుడో 12 ఏళ్ళ క్రితం 2013లో చేసిన సినిమా మద గజ రాజ ఇప్పుడు రిలీజయింది.

Vishal Anjali Varalaxmi Sarathkumar Madha Gaja Raja Movie Review
Vishal Madha Gaja Raja Movie Review : విశాల్ అప్పుడెప్పుడో 12 ఏళ్ళ క్రితం 2013లో చేసిన సినిమా మద గజ రాజ. అనేక కారణాల వల్ల అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఇటీవల సంక్రాంతికి తమిళ్ లో రిలీజయి హిట్ అవ్వడంతో మద గజ రాజ సినిమాని తెలుగులో నేడు జనవరి 31న రిలీజ్ చేసారు. విశాల్ హీరోగా, అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్స్ గా, సోనూ సూద్, సంతానం. మనోబాల, గాయత్రీ రావు, మణివణ్ణన్, శరత్ సక్సేనా, సత్య కృష్ణన్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. జెమినీ సర్క్యూట్స్ నిర్మాణంలో సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికొస్తే.. మదగజరాజ అలియాస్ రాజు(విశాల్) ఓ ఊళ్ళో కేబుల్ ఆపరేటర్ గా పనిచేసుకుంటూ ఉంటాడు. తను ప్రేమించిన అమ్మాయి(అంజలి), వాళ్ళ తండ్రితో విశాల్ నాన్న గొడవ పెట్టుకోవడంతో వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోతారు. రాజు, అతని ఫ్రెండ్స్ కి చిన్నప్పుడు వాళ్లకు బాగా క్లోజ్ అయిన మాస్టర్(శరత్ సక్సేనా) తన కూతురు పెళ్ళికి పిలవడంతో అందరూ మాస్టర్ కూతురి పెళ్ళికి వెళ్తారు. అక్కడ పెళ్లి కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే తన ఫ్రెండ్ కళ్యాణ్(సంతానం) డైవర్స్ తీసుకోబోతున్నాడని, మరో ఫ్రెండ్ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడని, మరో ఫ్రెండ్ జైలుకి వెళ్లి బెయిల్ పై వచ్చాడని తెలుస్తుంది.
దీంట్లో ఇద్దరి ఫ్రెండ్స్ కష్టాలకు బిజినెస్ మెన్ కాకర్ల విశ్వనాధ్(సోనూసూద్) కారణం అని తెలుస్తుంది. ఆ పెళ్లిలోనే మాయ(వరలక్ష్మి) పరిచయం అవుతుంది. మరి రాజు ఫ్రెండ్స్ సమస్యలను ఎలా తీర్చాడు, మాస్టర్ కూతురికి నచ్చిన వ్యక్తితో పెళ్లి ఎలా చేసాడు? తను ప్రేమించిన అమ్మాయిని కలుసుకున్నాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Tollywood Heros : ఈ హీరోలను విజయం వరించేది ఎన్నడో? సాలిడ్ సక్సెస్ కోసం వెయిటింగ్..
సినిమా విశ్లేషణ.. 12 ఏళ్ళ క్రితం సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇది ఒక రొటీన్ కమర్షియల్ సినిమా. ఓ ఇద్దరు హీరోయిన్స్, హీరో ఫ్రెండ్ కి సమస్య రావడం, హీరో మంచితనం, హీరో విలన్ ని ఎదిరించడం ఇంతే కథ. ఫస్ట్ హాఫ్ అంతా అందరి పాత్రలను పరిచయం చేసి మాస్టర్ ఇంటికి వెళ్లడం, అక్కడ పెళ్లి, అందరూ కలిసి ఎంజాయ్ చేయడంతో సరిపోతుంది. ఇంటర్వెల్ కి హీరో ఫ్రెండ్స్ కష్టాలు తెలియడంతో హీరో ఏం చేస్తాడు అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో హీరో సిటీకి వచ్చి విలన్ ని ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు అని సాగుతుంది.
12 ఏళ్ళ క్రితం రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల్లో ఫైట్స్, పాటలు, ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ఇందులో కూడా అంతే. ఈ సినిమాకి కామెడీ చాలా ప్లస్ అయింది. సంతానంతో పాటు సెకండ్ హాఫ్ లో సత్తిబాబు పాత్రలో మనోబాల ఇద్దరూ ఫుల్ గా నవ్విస్తారు. ప్రీ క్లైమాక్స్ అయితే ఓ పక్క సీరియస్ ట్రాక్ నడుస్తుంటే మరో పక్క పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారు. సినిమా కథ, లాజిక్స్, పాత రకం ఎలివేషన్స్, విజువల్స్.. లాంటివి ఏమి పట్టించుకోకుండా హ్యాపీగా నవ్వుకోవడానికి అయితే వెళ్లి ఈ సినిమా చూసేయొచ్చు. విశాల్, సోనూసూద్ ఇద్దరూ క్లైమాక్స్ ఫైట్ లో తమ సిక్స్ ప్యాక్ లతో అప్పటి ట్రెండ్ లో అదరగొట్టారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విశాల్ తన రెగ్యులర్ మాస్ యాక్టింగ్ తో మెప్పిస్తాడు. వరలక్ష్మిని క్యారెక్టర్ ఆర్టిస్ట్, నెగిటివ్ రోల్స్ లో చూసి ఈ సినిమాలో హాట్ హీరోయిన్ గా చూడటం కష్టమే. హోమ్లీ పాత్రలతో మెప్పించే అంజలిని కూడా కమర్షియల్ హీరోయిన్ గా చూడటం కష్టమే. సంతానం తన డైలాగ్స్ తో ఫుల్ గా నవ్విస్తే మనోబాల తన ఎక్స్‌ప్రెషన్స్ తో నవ్వేలా చేస్తాడు. సోనూసూద్ విలనిజం బాగానే ఉంది. గాయత్రీ రావు, సత్య కృష్ణన్, శరత్ సక్సేనా.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. సదా, ఆర్య గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకాస్త బాగుంటే బెటర్ అనిపిస్తుంది. సాంగ్స్ వినలేము, చూడలేము. కొన్ని పాత్రలకు తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల డామినెటేడ్ గా అనిపిస్తుంది. సినిమాకు డైలాగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. కామెడీ, హారర్ సినిమాలు తెరకెక్కించే సుందర్ ఈ సినిమాని తనదైన కామెడీ స్టైల్ లో బాగానే తీసి నవ్వించాడు. నిర్మాణ పరంగా అప్పటికి తగ్గట్టు బాగానే తీశారు. అప్పట్లో కొన్ని సీన్స్ హైదరాబాద్ రియల్ లొకేషన్స్ లో తీయడం గమనార్హం.
మొత్తంగా ‘మద గజ రాజ’ ఓ పాత సినిమా అయినా ఫుల్ గా నవ్వుకోడానికి అయితే వెళ్లి చూడొచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.