ఢిల్లీలా డెవలప్ చేస్తాం.. ఒక్క అవకాశం ఇవ్వండి: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయంగా అడుగు పెట్టబోతోంది. 2022లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ 2022వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని BJP ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు కనిపిస్తుంది.
ఈ సంధర్బంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలోని ప్రజలకు ఇస్తున్న సౌకర్యాలు ఉత్తరప్రదేశ్ ప్రజలకు అందట్లేదని అన్నారు. అవినీతి నాయకులు ఉత్తరప్రదేశ్‌ను మురికి రాజకీయాలకు దగ్గరగా.. అభివృద్ధికి దూరంగా ఉంచారని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీలో ప్రజలు పొందుతున్న సౌకర్యాలు ఉత్తరప్రదేశ్‌లో ఇంకా లేవని, రాజకీయ పార్టీలు అన్నీ, తమ ఇళ్లను నింపుకోవడం కోసం తప్ప ప్రజల కోసం పెద్దగా ఏమీ చేయలేదన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక్క అవకాశం ఇస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఢిల్లీలా డెవలప్ చేస్తామంటూ హామీ ఇచ్చారు.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించింది. ఇందుకోసం దళిత వర్గం నుంచి రాజేంద్ర పాల్ గౌతమ్‌ను ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమించింది. ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ స్పీకర్ రాఖి బిర్లాన్, ఎమ్మెల్యే సురేంద్ర కుమార్లను కో-ఇన్‌ఛార్జిగా నియమించింది. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజాపోరాటం నుంచి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ పాల్గొనగా.. “చీపురు కట్ట” గుర్తుపై పోటిచేశారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక హామీలు ప్రకటించగా.. ఈ ఎన్నికలలో 70 సీట్లకు గాను 28 సీట్లు సాధించారు. అయితే 32 స్థానాలు సాధించిన బిజెపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించటంతో, లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 8 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వగా.. తర్వాత 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.