ఢిల్లీలో అదనపు బలగాల మొహరింపు

Additional Forces In Delhi నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ అధికారులతో.. అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. సరిహద్దులతో పాటు.. ఢిల్లీలోని పలు చోట్ల చోటు చేసుకున్న పరిణామాలను అమిత్ షాకు అధికారులు వివరించారు. హోంశాఖ కార్యదర్శి, ఇంటలిజెన్స్ చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులతో ఢిల్లీలోని తాజా పరిస్థితిపై చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..ఢిల్లీలో అదనపు బలగాలను మోహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు చేసినవారి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సంయుక్త పోలీసు కమిషనర్ అన్నారు. ఐటీఓ వద్ద తాము ఏర్పాటు చేసిన బారికేడ్లవైపు ట్రాక్టర్ దూసుకెళ్లి.. నిరసన వ్యక్తం చేసిన రైతు మరణించాడని తెలిపారు. మృతి చెందిన రైతు మృతదేహాన్ని ఘాజీపూర్ తరలించారు అన్నదాతలు. రైతుసంఘాల నేతల పిలుపు మేరకు రైతులు వెనక్కి వెళ్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుగుపయనమయ్యారు.
ఇక, ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కేంద్రం వైఖరే కారణమని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా రైతులతో చర్చలు జరపాలన్నారు. ఇక, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల పట్ల కేంద్ర వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు, రైతుల ర్యాలీ కారణంగా ఢిల్లీ పరిధిలో రైలు ప్రయాణాలు రద్దు అయిన వారికి రైల్వేశాఖ ఊరట నిచ్చింది. రైళ్లు అందుకోలేకపోయిన వారికి టికెట్ సొమ్మును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.