కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు…ఢిల్లీలో అల్లర్ల వెనుక బీజేపీ హస్తం

  • Published By: venkaiahnaidu ,Published On : December 18, 2019 / 09:54 AM IST
కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు…ఢిల్లీలో అల్లర్ల వెనుక బీజేపీ హస్తం

Updated On : December 18, 2019 / 9:54 AM IST

దేశరాజధానిలో జరుగుతున్న హింసాత్మక అల్లర్ల వెనుక ఉన్నది బీజేపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతో బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే ఢిల్లీలో హింసను ప్రేరేపిస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. దేశంలో అల్లర్లను ఎవరు ఉసిగొల్పారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ప్రస్తుతం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో బీజేపీకి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఆప్ కు 62మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే.

ఢిల్లీలో పరిస్థితి గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని కేజ్రీవాల్ అన్నారు. శాంతి నెలకొనాలని తాము కోరుకుంటున్నామని, ప్రతిఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంది, కాని నిరసనలు శాంతియుతంగా ఉండాలి మరియు రాజ్యాంగంలోని పరిమితులలో ఉండాలని కేజ్రీవాల్ అన్నారు. హింసకు పాల్పడటానికి ఎవరినీ అనుమతించకూడదని ఆయన తెలిపారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి.