Ban on Rallies: ఎన్నికల సంఘం నిషేధం పొడగింపు.. వెయ్యి మందికి అనుమతి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధాన్ని విధించింది ఎన్నికల సంఘం.

Ban on Rallies: ఎన్నికల సంఘం నిషేధం పొడగింపు.. వెయ్యి మందికి అనుమతి

Rallies

Updated On : January 31, 2022 / 5:48 PM IST

Ban on Rallies: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధాన్ని విధించింది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం విధించిన నిషేధానికి నేడు(31 జనవరి 2022) చివరి రోజు కాగా.. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. అయితే, ర్యాలీలపై నిషేధాన్ని 11వ తేదీ వరకు పొడిగించింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. దీంతో ఎన్నికల బరిలోకి దిగిన రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారానికి ఇచ్చే మినహాయింపును పెంచేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఆయన బృందం సిద్ధమైంది. ఈ తగ్గింపు వచ్చేవారం రోజులు వర్తిస్తుంది.

కరోనా సంక్షోభం కారణంగా, ఎన్నికల సంఘం జనవరి 31వ తేదీ వరకు బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్/బైక్/వాహనాల ర్యాలీలు, ఊరేగింపులను ఎన్నికల సంఘం నిషేధించింది. గతంలో ఈ నిషేధాన్ని జనవరి 15 వరకు, తర్వాత జనవరి 22 వరకు పొడిగించారు, ఆపై జనవరి 31 వరకు నిషేధాన్ని పొడిగించక తప్పలేదు.

ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో బహిరంగ సభలు, అంతర్గత సమావేశాలకు తక్కువ సంఖ్యలో జనంతో నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది ఎన్నికల సంఘం. బహిరంగ ప్రదేశాల్లో సభలకు వెయ్యి మందిని మాత్రమే అనుమతించనున్నారు. డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌కి 20మందికి, అంతర్గత సమావేశాలకు 500మందికి అనుమతి ఇచ్చింది. కరోనా ప్రోటోకాల్, ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఓటింగ్‌ ప్రారంభం కానుండగా.. ఎన్నికలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్నాయి. యూపీలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. కాగా మణిపూర్‌లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఒకే దశలో ఓట్లు పోలింగ్ కానున్నాయి. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్నాయి.