వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్స్ అడ్మిన్లూ జాగ్రత్త

వివాదాస్పద అయోధ్య కేసులో చారిత్రక తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్టు. ఆ భూమి రాముడిదే అని తీర్పు ఇవ్వగా.. తీర్పుపై ఎవ్వరూ కూడా వివాదాస్పద కామెంట్లు చేయకూడదంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎవ్వరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లపై కన్నేసి ఉంచారు పోలీసులు.
ముఖ్యంగా ఫేస్‌బుక్ గ్రూపుల్లో, వాట్సప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఆ గ్రూపు అడ్మిన్లు తమ తమ గ్రూప్స్‌లో కేవలం అడ్మిన్లు మాత్రమే సమాచారం పంపే విధంగా సెట్టింగ్స్ మార్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గ్రూపుల్లో ఎవరు పోస్టింగులు పెట్టినా దానికి బాధ్యత అడ్మిన్‌లు వహించాలని చెబుతున్నారు.
సోషల్ మీడియా వేదికలను పర్యవేక్షించేందుకు పోలీసులు సైబర్ అండ్ మీడియా సెల్‌ను ఏర్పాటు చేశారు. సుప్రీం తీర్పు గురించి షేర్ అవుతున్న పోస్ట్‌లు, ఫోటోలు, వీడియోలను యూపీ పోలీసు అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. యూపీ పోలీసులు ఇప్పటికే కొన్ని వాట్సాప్ గ్రూప్‌లు, కొంతమంది నెటిజన్లను గుర్తించి వారిపై నిఘా పెంచారు.