Parrot Missing : మా చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి..పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన
మా పెంపుడు చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి ఇస్తాం అంటూ పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన ఇచ్చిందో కుటుంబం.

Parrot Missing
Family announced cash reward for missing parrot : ముద్దులొలికే మా రామ చిలుక ఎగిరిపోయింది. దాన్ని చూడకుండా మేం ఉండలేం.దాన్ని పట్టి తెస్తే నగదు బహుమతిగా ఇస్తాం ప్లీజ్ అంటూ పోస్టర్లతో ప్రకటన ఇచ్చిందో కుటుంబం. అంతేకాదు ఫేస్ బుక్, వాట్సాప్ ల్లో కూడా ప్రకటించారు. మా పెంపుడు రామచిలుకను పట్టి తెచ్చిస్తే రూ.5,100లు బహుమతిగా ఇస్తాం అంటూ ప్రకటిస్తోంది బీహార్ లోని గయకు చెందిన శ్యామ్‌దేవ్ ప్రసాద్ కుటుంబం. మా చిలుకమ్మను తెచ్చిస్తే రూ.5,100లు బహుమతి అంటూ ఊరంతా పోస్టర్లు వేసి మరీ ప్రకటించారు.
గయాలో పిపర్పతి రోడ్డులో ఉంటున్న శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్తా, సంగీత గుప్తాలు ఓ చిలుకను పెంచుకున్నారు. వాళ్లు పెంచుకునే చిలుక ఈ మధ్య ఇంట్లోంచి ఎగిరిపోయిందట. దాని కోసం వెదకని చోటు లేదు. చిలుకమ్మ కోసం తిండి నిద్ర మాని మరీ వెదికారు. అయినా దొరకలేదు. దానికోసం ప్రత్యేకంగా పోస్టర్లు వేయించారు. చిలుక ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 రివార్డు ప్రకటించారు. చిలుక ఫోటో ఉన్న పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో, మార్కెట్లలో వేశారు.
ఆ పోస్టర్లలో ఈ మధ్యే చిలుక వెళ్లిపోయిందని, దానిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పైగా చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని.. అయినా అది దొరకడం లేదని వాపోతున్నారు. చిలుక కోసం వీరు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రయత్నిస్తున్నారు. పోస్టర్లను అతికించడమే కాకుండా ఆన్‌లైన్‌లో ఫేస్‌బుక్ పోస్ట్‌లు, వాట్సాప్ మెసెజ్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
12ఏళ్లుగా చిలుకను పెంచుకుంటున్నామని, ఏప్రిల్ 5న ఇంట్లోంచి వెళ్లిపోయిందని శ్యామ్ ప్రసాద్ దంపతులు చెబుతున్నారు. మా చిలుకమ్మను ఎవరు తీసుకెళ్లారో..దయచేసి దానిని మాకు తిరిగి ఇవ్వండి. మీకు కావాలంటే చిలుకను కొని మరీ ఇస్తాం అంటూ వేడుకుంటున్నారు. మా చిలుకమ్మ కేవలం ఓ పక్షి మాత్రమే కాదు మా కుటుంబంలోని సొంత మనిషిలాంటిదేనని వేడుకుంటున్నారు.
Also read : Raad more : Dog Missing : తప్పిపోయిన శునకం.. ఆచూకీ చెబితే రూ.5వేలు