UP : కళ్యాణ్ సింగ్ జీవిత విశేషాలు, మూడు రోజులు సంతాప దినాలు
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణానికి రాష్ట్రం మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తుందని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ప్రకటించారు.

Kalyan Singh
Biography of Kalyan Singh : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణానికి రాష్ట్రం మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తుందని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ ప్రకటించారు. కల్యాణ్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం నరోరాలో గంగానదీ తీరాన అంత్యక్రియలు నిర్వహిస్తామని యోగీ తెలిపారు. అటు కల్యాణ్ సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. కల్యాణ్ సింగ్ మరణం మాటల్లో చెప్పలేని విషాదమన్నారు.
60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం : –
తన 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు అలంకరించారు. బీజేపీ మూల సిద్ధాంతం హిందుత్వను బలంగా వినిపించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించారు. ఆయనకు కుమారుడు రాజ్‌వీర్ సింగ్, కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. రాజ్‌వీర్ సింగ్ ప్రస్తుతం ఏత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.
1932లో జననం : –
కల్యాణ్ సింగ్ 1932, జనవరి 5న తేజ్‌పాల్ సింగ్ లోధి, సీతాదేవి దంపతులకు యూపీలోని అలీగఢ్ జిల్లా మధౌలీ గ్రామంలో జన్మించారు. 60 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అరుదైన నేతగా కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1957లో RSS ప్రచారక్‌గా మొదలై ఆ తర్వాత జన్‌సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
21 నెలల జైలు జీవితం : –
నాటి ప్రధాని ఇందిరా గాంధీ అమలుచేసిన ఎమర్జెన్సీ కాలంలో 21 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1991 జూన్‌లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయోధ్యను దర్శించి రామమందిర నిర్మాణానికి ప్రతిన బూనారు. కల్యాణ్‌సింగ్ సీఎంగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 1993 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అత్రౌలి, కాస్‌గంజ్ అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. దీంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత 1997లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో మళ్లీ సీఎం అయ్యారు.
బీజేపీని వీడి..మళ్లీ : –
బీజేపీతో విభేదాలు తలెత్తడంతో 1999లో కాషాయ దళాన్ని వీడి సొంతంగా రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. 2004లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కోరిక మేరకు మళ్లీ బీజేపీలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు. అదే సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బులంద్‌షెహర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2009 జనవరి 20న బీజేపీను మళ్లీ వీడి స్వతంత్ర అభ్యర్థిగా ఇటా లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి తన సత్తా చాటారు. అనంతరం తన కుమారుడు రాజ్‌వీర్ సింగ్‌తో కలిసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.