నదిలో పడిపోయిన బీజేపీ ఎంపీ

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 05:13 AM IST
నదిలో పడిపోయిన బీజేపీ ఎంపీ

Updated On : October 3, 2019 / 5:13 AM IST

పాటలీపుత్రం బీజేపీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్‌కు పెనుప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ..పరిస్థితిని పరిశీలిస్తున్న ఎంపీగారు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు. దీంతో ఎంపీ రామ్ కృపాల్ కు ప్రమాదం తప్పింది.  

వివరాల్లోకి వెళితే..బీహార్  రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలతో అతలాకుతలమైన ధనురువా ప్రాంతాన్ని  పరిశీలించేందుకు ఎంపీ కృపాల్ యాదవ్ బుధవారం (అక్టోబర్ 2)రాత్రి వెళ్లారు. నదికి అవతలి గట్టున్న ప్రాంతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారు. బాధితులకు సహాయం చేయాలనుకున్నారు. దీంతో నది అవతలి గట్టుకు వెళ్లేందుకు బోటు అందుబాటులో లేదు. దీంతో వరదలో చిక్కుకున్న గ్రామస్థులు  ఉపయోగించే టైర్ల ట్యూబ్‌లతో తయారు చేసిన పడవలోనే  బయలుదేరారు.

ఎంపీతో పాటు మరికొంతమంది స్థానికులు టైర్ల బోటులోకి ఎక్కారు. ఈ క్రమంలో ఎంపీ అదుపుతప్పి నీటిలో పడిపోయారు. వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యి.. ఆయన్ను రక్షించారు. తమ దగ్గరున్న టవర్స్ తో పూర్తిగా తడిసిపోయిన ఆయనకు సపర్యలు చేశారు. వారి అభిమానానికి ఎంపీ సంతోషించారు. మీ ఇబ్బందులకు తెలుసుకున్నాననీ..దానికి తగిన సహాయాన్ని వెంటనే అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

ప్రమాదం నుంచి బైటపడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని.. గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. వరదలతో అల్లాడుతున్న ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి ఎంపీనైన తనకు కనీసం పడవ కూడా దొరకలేదని.. ఇక సామాన్యలు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సహాయం లభించకపోవటం వల్లనే గ్రామస్థులు టైర్లతో ట్యూబులతో తయారుచేసిన పడవను ఉపయోగించాల్సి పరిస్థితి ఉందన్నారు. ఇది ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.