శరణార్థులను మీరే గుర్తించండి : బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు

పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో పొరుగుదేశాల నుంచి వచ్చి శరణార్థులుగా ఉంటున్న వారిని గుర్తించాలని,వారికి సహాయపడాలని పార్టీ హైకమాండ్ వారిని ఆదేశించినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు ఈ పని చేయాలని పార్టీ నుంచి వారికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా పౌరసత్వ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా చేయడం కూడా ఇందులో భాగంగా ఉంది. డిసెంబర్ -31న ఈ డ్రైవ్ పూర్తికానుందని బీజేపీ తెలిపింది. అంతేకాకుండా పౌరసత్వ సవరణ చట్టంకి సంబంధించి ఓ వైట్ పేపర్ ప్రిపేర్ చేస్తుంది. 1950లో జవహర్ లాల్ నెహ్రూ-లిఖాయత్ అలీ ఒప్పందానికి సంబంధించిన ఓ చాప్టర్ కూడా ఈ వైట్ పేపర్ లో ఉండనుందని సమాచారం.
తమ దేశంలో నివసిస్తున్న మైనార్టీలను రక్షణకల్పిస్తామని ప్రమాణం చేసిన పాకిస్తాన్ ఏ విధంగా అందులో విఫలమయిందో కూడా ఆ వైట్ పేపర్ లో హైలెట్ చేయనున్నారు. ఈ వైట్ పేపర్ ను స్థానిక బాషల్లో కూడా అనువాదించి ఎక్కువమందికి అందించనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చాలామంది శరణార్థులు ఏళ్లుగా నివసిస్తున్నట్లు తాము గుర్తించామని,గౌతమ్ గంభీర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో దాదాపు 16వేల మంది ఇతరదేశాల నుంచి వచ్చిన శరణార్థులు ఉన్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. అదేవిధంగా కర్ణాటకలోని కొప్పాల్ లో 24వేల మంది శరణార్థులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.