వ్యూహాలు, ఎన్నికల లెక్కలు ఎలా ఉండబోతున్నాయో సూచనలిచ్చిన బీజేపీ

Lok Sabha Elections 2024: అదే విధానాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ అనుసరిస్తోంది. గెలవగల అవకాశాలున్న అభ్యర్థులకే..

వ్యూహాలు, ఎన్నికల లెక్కలు ఎలా ఉండబోతున్నాయో సూచనలిచ్చిన బీజేపీ

BJP

Updated On : March 3, 2024 / 7:06 PM IST

ఎన్నికల వ్యూహాలు రచించడంలో, ఓటర్లను ఆకర్షించడంలో, గెలుపును నల్లేరు మీద నడకలా మార్చుకోవడంలో, స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో….ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎవరికీ అందని ఎత్తులు వేయడంలో…..ఆరితేరిన పార్టీ…అన్ని నైపుణ్యాలూ చాటే పార్టీ….అనుకున్నది సాధించే పార్టీ ఏదంటే…అనుకూలత, వ్యతిరేకత అన్నదానితో సంబంధం లేకుండా అందరూ చెప్పే మాట బీజేపీ.

చాలా రోజుల క్రితమే కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయమని ప్రకటించి….ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం…ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి…..తొలి అడుగు వేసేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమి పొత్తులు కుదుర్చుకోవడంలోనే తీవ్రగందరగోళానికి లోనవుతుంటే… బీజేపీ నేతృత్వంలోని NDA మాత్రం తన లక్ష్యసాధన దిశగా దూసుకుపోతోంది.

కేంద్రంలో శక్తివంతమైన నేతలుగా భావించేవారి స్థానాలతో పాటు…. కీలకమైన రాష్ట్రాల్లో అభ్యర్థులను తొలివిడతలో ప్రకటించేసింది బీజేపీ. తద్వారా బీజేపీ వ్యూహాలు, ఎన్నికల లెక్కలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేసింది. అందరూ ఊహించినట్టుగానే వారణాసి నుంచే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు ప్రధాని మోదీ.

తొలిసారి వారణాసి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టి ప్రధాని అయిన మోదీ…మూడోసారి ప్రధాని అయ్యేందుకు వారణాసినే ఎంచుకున్నారు. 2014లో, 2019లో వారణాసి నుంచి పోటీచేసిన ప్రధాని..ఈ సారీ అదే స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. 2014లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పైన, 2019లో ఎస్పీ నేత షాలిని యాదవ్‌ పైన ప్రధాని గెలిచారు. వారణాసిని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి….పుణ్యస్థలం రూపురేఖలు మార్చివేసిన ప్రధాని…అక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి.

స్మృతిఇరానీకి మరోసారి అదే స్థానం
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఓడించిన కేంద్రమంత్రి స్మృతిఇరానీకి మరోసారి అదే స్థానం కేటాయించి…తొలివిడత జాబితాలో ప్రకటించింది బీజేపీ. గాంధీ-నెహ్రూ కుటుంబం ఆస్థాన నియోజకవర్గంగా పేరొందిన అమేథీలో రాహుల్‌గాంధీని ఓడించడం ద్వారా స్మృతిఇరానీ దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ సారి కాంగ్రెస్ తరపున అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. బీజేపీ మాత్రం…కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీచేసినా తమకు సంబంధం లేదన్నట్టు స్మృతిఇరానీ గెలుపుపై ధీమా ప్రకటిస్తూ ఆమెనే అభ్యర్థిగా ప్రకటించింది.

కేంద్రంలో మోదీ తర్వాత అంత శక్తిమంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్ మాండవీయ పోరుబందర్ స్థానం నుంచి, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ప్రధానితో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా యూపీలోనే పోటీచేస్తున్నారు. లక్నో నుంచి ఆయన పోటీలో నిలిచారు. హేమమాలిని, రవికిషన్, సాక్షి మహారాజ్, సాథ్వీ నిరంజన్ జ్యోతి వంటి ప్రముఖులు యూపీ బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు. హేమమాలినిని పోటీనుంచి తప్పిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆమెను మరోసారి మధుర బరిలో నిలిపారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గతంలోలానే రాజస్థాన్‌లోని కోటా నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి నలుగురు కేంద్రమంత్రులు బరిలో ఉన్నారు. బికనీర్ నుంచి మంత్రి అర్జున్‌ రామ్ మేఘ్వాల్, ఆల్వార్ నుంచి భూపేంద్ర యాదవ్, జోధ్‌పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, బార్మర్ నుంచి కైలాశ్‌సింగ్ చౌధురి పోటీచేస్తున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరాజే సింథియా కుమారుడు దుష్యంత్‌సింగ్‌ ఝలావర్-బరాన్ నాలుగోసారి పోటీలో నిలుస్తున్నారు.

మరో కేంద్రమంత్రి వి. మురళీధరన్ కేరళలోని అట్టింగల్ నుంచి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి అభ్యర్థులుగా నిలిచారు. కిరణ్ రిజిజు అరుణాచల్‌ప్రదేశ్ పశ్చిమం నుంచి, అసోం మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్ అసోంలోని దిబ్రూగర్‌ నుంచి బరిలో నిలుస్తున్నారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిశ నుంచి, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యసింథియా గుణ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు. తొలి జాబితా ప్రకటనకు కొన్ని గంటల ముందు సిట్టింగ్ ఎంపీలయిన ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్, జయంత్ సిన్హా ఎన్నికల్లో పోటీచేయబోమని ప్రకటించారు. క్రికెట్‌కే పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నానని గౌతమ్ గంభీర్ చెప్పారు.

మొదటి జాబితాలో..
మొత్తం 195 మందితో బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో 28 మంది మహిళలకు చోటు దక్కింది. ఎస్సీ అభ్యర్థులు 27 మంది, ఎస్టీ అభ్యర్థులు 18 మంది, ఓబీసీ అభ్యర్థులు 57మంది పోటీచేస్తున్నారు. తొలి జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో ఇద్దరు మాజీముఖ్యమంత్రులు, 34 మంది కేంద్రమంత్రులు ఉన్నారు.

బీజేపీ ప్రకటించిన జాబితాలో 47 మంది 50 ఏళ్లలోపువారు ఉన్నారు. తెలంగాణలో 9, ఉత్తరప్రదేశ్‌లో 51, పశ్చిమబెంగాల్‌లో 20, మధ్యప్రదేశ్‌లో 24, గుజరాత్‌లో 15, రాజస్థాన్‌లో 15, కేరళలో 12, అసోంలో 11, ఝార్ఖండ్‌లో 11, చత్తీస్‌గడ్‌లో 12, ఢిల్లీలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. సీనియర్ మంత్రులు రాజ్యసభ నుంచి పోటీచేయాలని ఇప్పటికే ప్రధాని మోదీ విజ్ఞప్తిచేశారు.

2019 ఎన్నికల్లో తొలి జాబితాలో 184 సీట్లు ప్రకటించింది బీజేపీ. వీలయినంత తొందరగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా, వారికి ప్రచారం చేయడానికి ఎక్కువ సమయం ఉండేలా చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందాలన్నది బీజేపీ వ్యూహం. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యూహంతోనే బీజేపీ గెలుపు సాధించింది.

దీంతో అదే విధానాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ అనుసరిస్తోంది. గెలవగల అవకాశాలున్న అభ్యర్థులకే తొలిజాబితాలో ప్రాధాన్యత ఇచ్చామని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై మరిన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారుచేయనుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది.

BRS Lok Sabha Candidates : బీఆర్ఎస్ రేసు గుర్రాలు రెడీ.. రేపు 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన