మహా సస్పెన్స్ : పవార్‌కు రాష్ట్రపతి పదవి?

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్దత కంటిన్యూ అవుతోంది. శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశంతో పాటు, పవార్‌కు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, బీజేపీకి మద్దతిచ్చే విషయాన్ని శరదపవార్ నిర్ద్వంద్వంగా ఖండించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే…మహారాష్ట్ర కాంగ్రెస్ – ఎన్సీపీ నేతల సమావేశం 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం జరుగనుంది. వాస్తవానికి ఈ సమావేశం మంగళవారం జరగాలి. కానీ కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో సమావేశం పోస్ట్ పోన్డ్ అయ్యింది. ఎన్సీసీ, కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీకాబోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటుపైనే నేతలు చర్చలు జరుపనున్నారు. శివసేనతో జట్టుకట్టడంపైనా చర్చించనున్నారు. సోనియాగాంధీతో జరిపిన చర్చల సారాంశాన్ని శరద్‌పవార్ నేతలకు వివరించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై తొందర వద్దని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తోంది. కనీస ఉమ్మడి కార్యక్రమానికి శివసేన అంగీకరిస్తేనే పొత్తుపై ఆలోచించాలని ఆదేశించింది. దీంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడంపై అనుమానాలు ఏర్పడుతున్నాయి. తదుపరి ప్రభుత్వం తమదేనని శివసేన చెబుతోంది. ఆ పార్టీకి ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై విభిన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగేందుకు కారణమయ్యాయి.
Read More : మంచిది : లైక్‌లు కనిపించవు