కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన

  • Published By: venkaiahnaidu ,Published On : September 26, 2019 / 11:55 AM IST
కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన

Updated On : September 26, 2019 / 11:55 AM IST

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.  ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఇవాళ తీవ్ర ఆందోళన చేపట్టింది. బీజేపీ పూర్వాంచల్ మోర్చా కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టుకుని కేజ్రీవాల్ ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ముందు జాగ్రత్తగా పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించినప్పటికీ.. నిరసనకారులు బారికేడ్లు సైతం ఎక్కేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 
దేశ రాజధానిలో కనుక NRC నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ..ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందని బుధవారం సీఎం కేజ్రీవాల్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే NRC సీఎం కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ పై ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. పూర్వాంచల్ కు చెందినవాళ్లు అక్రమ వలసదారులని కేజ్రీవాల్ చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎవరిని ఢిల్లీ నుంచి ఆయన వెళ్లగొడదామనుకుంటున్నారని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని విదేశీయులుగా పరిగణిస్తారా,ఢిల్లీ నుంచి వెళ్లగొడదామనుకుంటున్నారా అని కేజ్రీవాల్ ను తివారీ ప్రశ్నించారు. అదే కేజ్రీవాల్ ఉద్దేశ్యమయితే…ఆయన మానసిక స్థితి కోల్పోయింటారని తాను అనుకుంటున్నట్లు తివారీ తెలిపారు. ఒక IRS అధికారిగా పనిచేసిన ఆయనకు NRC అంటే ఏంటో తెలియదా అని ప్రశ్నించారు. కాగా సీఎం కేజ్రీవాల్‌‌, ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నీలకంఠ భక్షి, కపిల్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.