ఒడిషా ఎన్నికల ప్రచారంలో నాగార్జున పాట

  • Published By: chvmurthy ,Published On : April 21, 2019 / 08:02 AM IST
ఒడిషా ఎన్నికల ప్రచారంలో నాగార్జున పాట

Updated On : April 21, 2019 / 8:02 AM IST

భువనేశ్వర్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకుని వాళ్లతో ఓట్లు వేయించుకోటానికి  నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించేటప్పుడు ఇస్త్రీ చేసే వాళ్లు కొందరైతే, హోటల్ లో దోశెలు వేసే వాళ్లు కొందరు,. రైతు బజారు లో కూరలు అమ్మే వాళ్లు..ఆయా ప్రాంతాల వారిగా అక్కడి ప్రజలతో మమేకమై వారి ఇష్టాయిష్టాలు తెలుసుకొని మరీ ప్రచారంలో అలాంటి పనులు చేస్తారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వచ్చిన ఏ చిన్న ఛాన్స్‌ను కూడా వదులుకోరు. తాజాగా మన పొరుగున ఉన్న ఒడిశాలో తెలుగు పాటలు పాడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఓ బీజేపీ అభ్యర్థి.

సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోని పూరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ  అభ్యర్ధి సంబిత్ పాత్రా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం రాత్రి  నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సభకు వచ్చిన కొందరు తెలుగువాళ్లు సరదాగా పాట పాడమని సంబిత్‌ను కోరారు. ఇంకేముంది మన పొలిటికల్‌ లీడర్‌ కాస్త సింగర్‌ అవతారం ఎత్తాడు. నాగార్జున నటించిన క్రిమినల్ సినిమాలోని తెలుసా.. మనసా అనే పాటను, మెగా స్టార్ చిరంజీవి నటించిన ఘరానా మెుగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట  పాటలను పాడి ఓటర్లను హుషారెక్కించారు.  సంబిత్ పాడిన పాటకు అక్కడున్న జనాలంతా  ఆనందంతో చప్పట్లుకొట్టి అభినందనలు తెలిపారు. అద్భుతంగా పాడారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రొఫెషనల్‌ సింగర్‌లా పాడారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖతాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్‌గా మారటంతో.. నెటిజన్లు సైతం సంబిత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.