బీజేపీలో చేరేందుకు జాబ్ వదులుకున్న కలకత్తా హైకోర్టు జడ్జి

భారతీయ జనతా పార్టీలో చేరేందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు.

బీజేపీలో చేరేందుకు జాబ్ వదులుకున్న కలకత్తా హైకోర్టు జడ్జి

calcutta high court judge abhijit gangopadhyay resigns to join BJP

Updated On : March 5, 2024 / 6:21 PM IST

Abhijit Gangopadhyay: బీజేపీలో చేరేందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కోల్‌కతాలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. గురువారం మధ్యాహ్నం బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. “చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి” అంటూ కితాబిచ్చారు.

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను రాజకీయాల్లోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రేరేపించిందని సెటైర్లు వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం పార్టీలపైనా విమర్శలు చేశారు. ‘‘అవినీతి కూపంగా మారిన తృణమూల్ కాంగ్రెస్ పనైపోయింది. ప్రధాని మోదీ చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, ఈ దేశం కోసం ఏదైనా చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను దేవుడిని, మతాన్ని నమ్ముతాను. కానీ సీపీఎం నమ్మదు. కాంగ్రెస్ ఒక కుటుంబానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని జస్టిస్ గంగోపాధ్యాయ వ్యాఖ్యానించారు.

తాను విచారిస్తున్న లంచం కేసు గురించి గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించడంతో జస్టిస్ గంగోపాధ్యాయ హాట్ టాపిక్‌గా మారారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన బరిలోకి దిగుతారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న తమ్లుక్ లోక్‌స‌భ‌ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2009 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌ ఇక్కడ పాగా వేసింది.

Also Read: ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు