సీబీఐ కి కొత్త బాస్ : రిషికుమార్ శుక్లా

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 12:45 PM IST
సీబీఐ కి కొత్త బాస్ : రిషికుమార్ శుక్లా

Updated On : February 2, 2019 / 12:45 PM IST

ఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా  రిషికుమార్ శుక్లా నియమితులయ్యారు. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్లా ఈపదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. శుక్లా మధ్యప్రదేశ్ ఐపీఎస్ కేడర్,1983 బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారి. రిషికుమార్ శుక్లా పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్యానల్ ఖరారు చేసింది.

ఇంటిలిజెన్స్ బ్యూరోలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన శుక్లా, మధ్యప్రదేశ్ డీజీపీగా కూడా పని చేశారు. 3 రోజుల క్రితమే ఆయన మధ్యప్రదేశ్ డీజీపీ పదవికి రాజీనామా  చేశారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వర రావు నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. గతంలో ఉన్న ఇద్దరు సీబీఐ అధికారులు అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాల మధ్య వచ్చిన విబేధాల కారణంగా వారిద్దరిని తప్పించి కొత్త వ్యక్తిని నియమించాల్సి వచ్చింది. 

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు సీబీఐ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే  ప్రభుత్వం,  ప్రభుత్వ సంస్ధల ప్రతిష్టను దిగజారుస్తోందని,వాటిలో రాజకీయ జోక్యం ఎక్కువ్యయిందని ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో శుక్లా బాధ్యతలు తీసుకుంటున్నారు.