Uttarakhand Tunnel : శ్రామికుల జీవితాల్లో మళ్లీ దీపావళి.. సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుల గ్రామాల్లో బాణసంచా కాల్చి సంబరాలు

పొట్టకూటి కోసం వచ్చి 17 రోజులు సొరంగంలో చిక్కుకుపోయిన 41మంది కార్మికులు బతికి బయటపడ్డారు. ఎంతోమంది కృషికి ఫలితంగా..సొరంగంలో ఇరుక్కుపోయినా ధైర్యాన్ని కోల్పోకుండా జీవితంమీద ఆశతో తాము తమ కుటుంబాలను కలుస్తామన్న నమ్మకానికి ప్రతిఫలంగా వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

Uttarakhand Tunnel : శ్రామికుల జీవితాల్లో మళ్లీ దీపావళి.. సొరంగం నుంచి బయటపడ్డ కార్మికుల గ్రామాల్లో బాణసంచా కాల్చి సంబరాలు

Uttarakhand Tunnel Wokers villeges celebrate

Updated On : November 29, 2023 / 12:04 PM IST

Uttarakhand Tunnel Wokers villeges celebrate : పొట్టకూటి కోసం వచ్చి 17 రోజులు సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు బతికి బయటపడ్డారు. ఎంతోమంది కృషికి ఫలితంగా.. సొరంగంలో ఇరుక్కుపోయినా ధైర్యాన్ని కోల్పోకుండా జీవితం మీద ఆశతో తాము తమ కుటుంబాలను కలుస్తామన్న నమ్మకానికి ప్రతిఫలంగా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. 17 రోజులు సొరంగంలో నరకయాతన తరువాత గత రాత్రి అందరు సురక్షితంగా బయటపడ్డారు. వారంతా క్షేమంగా బయటకొచ్చి వారి కుటుంబాలను కలుసుకోవాలని యావత్ భారతం కోరుకుంది. ఎంతోమంది వారి కోసం ప్రార్ధించారు. ఎట్టకేలకు 41 మంది కార్మికులు సొరంగాన్ని జయించారు. మృత్యుంజయులుగా బయటపడ్డారు.

తమ వారి క్షేమం కోసం పరితపించిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రతీ క్షణం గుండెను చిక్కబట్టుకుని తమ వారి కోసం వేయి కళ్లతో వేచి చూసిన వారి నిరీక్షణకు తగిన ఫలితం లభించింది. తమ వారి కోసం సొరంగం బయటే రోజుల తరబడి ఎదురు చూసినవారి ఆశలు ఫలించాయి. అందరు సురక్షితంగా బయటపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆ 41 మంది కార్మికుల గ్రామాలకు మరోసారి దీపావళి పండుగ వచ్చింది. తమవారు సురక్షితంగా సొరంగం నుంచి బయటకు రావటంతో కార్మికుల కుటుంబ సభ్యులు బాణసంచా కాల్చుకుని సంబరాలు చేసుకున్నారు. మరోసారి దీపావళి పండుగ జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని ఆనందాలను పంచుకున్నారు.

ఉత్తరకాశి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల రాజేంద్ర బేడియా, సుఖ్ రామ్, అనిల్ లు కూడా ఉన్నారు. వారు సురక్షితంగా బయటకు రావటంతో రాంచీ శివార్లలోని ఖిరాబెడ్ అనే మారుమూల గ్రామంలో దీపావళి పండుగ సందడి నెలకొంది. పక్షవాతంతో బాధపడుతున్న రాజేంద్ర బేడియా తండ్రి.. కుమారుడు క్షేమంగా వస్తాడో రాడో అని అల్లాడిపోయాడు. నిరుపేదలైన ఆ కుటుంబం రాంజేద్ర క్షేమంగా రావాలని మొక్కని దేవుడు లేడు. వేయి కళ్లతో కొడుకు కోసం ఎదురుచూసిన ఆ తండ్రి ఎదురుచూపులు ఫలించాయి. కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలిసిన ఆ తండ్రి గుడిసెముందు వీల్ చైర్ లో ధీమాగా కూర్చున్నాడు. ‘‘దేవుడు నా మాట విన్నాడు.. నా కొడుకును రక్షించాడు’’ అంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు.

Also Read: ఉత్తరకాశీ సొరంగం ఆపరేషన్ సక్సెస్ పై ఆనంద్ మహీంద్రా ఫుల్ హ్యాపీ.. ఏమన్నారంటే..

అలాగే ఈ సొరంగంలో చిక్కుకున్న అనిల్ సోదరుడు కూడా అదే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నా సోదరుడిని దేవుడు రక్షించాడు అంటూ సంతోషపడిపోయాడు. నేను నా సోదరుడి కోసం సొరంగం వద్దే వేచి ఉన్నాను. అందరితో పాటు అతను కూడా బయటకు రావటంతో ఆస్పత్రికి తరలించారు. సోదరుడి కూడానే అతని పక్కనే అంబులెన్స్ లో ఉన్నానని తెలిపాడు. అలాగే అస్సాంకు చెందిన ఓ కార్మికుడు కుటుంబంలోను అదే ఆనందం నిండింది. ఇలా 41 మంది కార్మికుల కుటుంబ సభ్యులు తమ తమ ఆనందాలను పంచుకున్నారు. తమ వారిని రక్షించినవారికి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. మీ ధైర్యం, సాహసం గొప్పవి అంటూ ప్రశంసలు

ఇలా ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ప్రతీ ఒక్క కార్మికుడి కుటుంబాల్లోను ఇటువంటి పరిస్థితే నెలకొంది. ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. వారి వారి ఆనందాలను బాణసంచా కాల్చి.. మిఠాయిలు తినిపించుకుంటు.. ఆనందాన్ని పంచుకుంటున్నారు.