FCRA License Revoked : మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్‌ చారిటీతో సహా 6 వేల ఎన్జీవోలకు FCRA లైసెన్స్ రద్దు

డిసెంబరు 31తో గడువు పూర్తయిన దాదాపు 6వేల ఎన్జీవోలతో పాటు...కొన్ని నెలల క్రితమే గడువు పూర్తయిన మరో 6వేల ఎన్జీవోలు ఇక నుంచి విదేశీ నిధులు పొందలేవు.

FCRA License Revoked : మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్‌ చారిటీతో సహా 6 వేల ఎన్జీవోలకు FCRA లైసెన్స్ రద్దు

Frca (1)

Updated On : January 2, 2022 / 12:33 PM IST

Central govt revoked FCRA license : మతమార్పిడిలపై ఇటీవల వివాదం ఎదుర్కొన్న మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్‌ చారిటీతో సహా దాదాపు 6వేల ఎన్జీవోలకు కేంద్రం షాకిచ్చింది. విదేశాల నుంచి నిధుల పొందేందుకు వీలు కల్పించే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ లైసెన్స్ రద్దు చేసింది. మొత్తం 12వేల580 ఎన్జీవోలకు లైసెన్స్ గడువు డిసెంబరు 31తో ముగిసింది. వాటిలో 5వేల 789 ఎన్జీవోలు నిన్నటి నుంచి విదేశీ నిధులు పొందే అవకాశాన్ని కోల్పోయాయి.

2020లో FCRAను కేంద్రం సవరించింది. దీంతో 2020 సెప్టెంబరు 30 నుంచి 2021 డిసెంబరు 31లోపు వాటిని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును కేంద్రం నాలుగుసార్లు పెంచింది. అయితే మొత్తం 18వేల 778 ఎన్జీవోలు లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా…12వేల989 ఎన్జీవోలు మాత్రమే దరఖాస్తు చేశాయని హోంమంత్రిత్వశాఖ కార్యాలయం తెలిపింది.

Omicron Variant : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్‌ టెన్షన్.. దుబాయ్‌ నుంచి వచ్చిన పలువురికి వేరియంట్

వాటిలో మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్‌ చారిటీ సహా 179 సంస్థల దరఖాస్తులను కేంద్రం తిరస్కరించింది. మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తోంది. డిసెంబరు 31తో గడువు పూర్తయిన దాదాపు 6వేల ఎన్జీవోలతో పాటు…కొన్ని నెలల క్రితమే గడువు పూర్తయిన మరో 6వేల ఎన్జీవోలు ఇక నుంచి విదేశీ నిధులు పొందలేవు. అంటే 12వేలకు పైగా సంస్థలకు విదేశీ సాయం ఆగిపోతుంది. గడువు పొడిగించినా దరఖాస్తు చేసుకోకపోతే…లైసెన్స్ ఎలా రెన్యువల్ చేస్తామని కేంద్రం ప్రశ్నించింది.

ఆక్స్‌ఫామ్ ఇండియా ట్రస్ట్, జామియా మిలియా ఇస్లామియా, హమ్‌దర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, DAV కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, JNU న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హబిటట్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ట్యూబర్ క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా సహా అనేక సంస్థలున్నాయి. కొన్ని ఎన్జీవోల FCRA గడువును ఈ ఏడాది మార్చి 31వరకు పొడిగించింది కేంద్రం.

Vaccination : దేశవ్యాప్తంగా రేపటి నుంచి పిల్లలకు టీకా

తాజాగా లైసెన్సులు రద్దవడంతో ప్రస్తుతం FCRA లైసెన్స్ ఉన్న ఎన్జీవోల సంఖ్య 16వేల829కి పడిపోయింది. లైసెన్సుల రద్దుకు ముందు వాటి సంఖ్య 22వేల797గా ఉంది. ఎన్జీవోలపై ఇటీవల తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నిస్వార్థంగా సేవచేస్తున్నప్పటికీ..మరికొన్ని విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇది చాలదన్నట్టు…మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీపై మతమార్పిడల వివాదం పడింది.

ఆ చారిటీ గుజరాత్ డైరెక్టర్…యువతులతో బలవంతంగా మతంమారుస్తున్నట్టు కేసు నమోదయింది. మిషనరీస్ ఆఫ్‌ చారిటీ ప్రధాన కార్యాలయం కోల్‌కతాకు చెందిన బ్యాంక్ ఎకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేయడంపై రాజకీయ రగడ జరుగుతోంది. ఈ వివాదం సద్దుమణగకముందే.. అనేక ఎన్జీవోల లైసెన్స్ రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది.