23 Breeds Ban Dogs : ఆ 23 జాతుల పెంపుడు కుక్కలపై నిషేధం.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

23 Breeds Ban Dogs : పెంపుడు కుక్కల దాడుల ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 23 జాతులకు చెందిన కుక్కల పెంపకాన్ని నిషేధించాలని ఆదేశించింది.

23 Breeds Ban Dogs : ఆ 23 జాతుల పెంపుడు కుక్కలపై నిషేధం.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Centre Asks States To Ban 23 Breeds Of Ferocious Dogs _ Check List

Updated On : March 15, 2024 / 12:02 AM IST

23 Breeds Ban Dogs : ప్రస్తుతం చాలా చోట్ల పెంపుడు కుక్కల దాడులు ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్‌వీలర్, మాస్టిఫ్‌లతో సహా 23 జాతుల క్రూరమైన (ఫెరోషియస్) కుక్కల అమ్మకం, పెంపకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

కేంద్రం ఆదేశాల ప్రకారం.. 23 జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకోవడాన్ని నిషేధిస్తుంది. ఇప్పటికే పెంపుడు జంతువులుగా పెంచుకున్న ఈ జాతి కుక్కలను స్టెరిలైజ్ చేయాలని, తదుపరి సంతానోత్పత్తి జరగకుండా చూడాలని కేంద్రం తెలిపింది.

మొత్తం 23 జాతులను గుర్తించిన నిపుణుల ప్యానెల్ :
కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా ఇతర ప్రయోజనాల కోసం ఉంచకుండా నిషేధించాలని పౌరులు, పౌర వేదికలు, జంతు సంక్షేమ సంస్థల నుంచి ఫిర్యాదులు అందాయని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ తెలిపింది. అయితే, నిపుణుల ప్యానెల్ 23 జాతులకు సంబంధించిన కుక్కలను గుర్తించింది. వాటిలో మిశ్రమ, సంకర జాతులు ఉన్నాయి.

కొన్ని క్రూరమైనవి, మానవ జీవితాలకు కూడా ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. ప్రత్యేకించి.. పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్ వంటి జాతులను కేంద్రం నిషేధించాలని కోరింది.

ఇతర జాతులలో సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్ంజక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బాండోగ్ ఉన్నాయి. సంకర జాతులతో సహా ఇతర కుక్క జాతులు దిగుమతి, పెంపకం, పెంపుడు కుక్కలుగా విక్రయించడం, ఇతర ప్రయోజనాల కోసం నిషేధించనున్నట్టు నిపుణుల ప్యానెల్ పేర్కొంది.

సంతాన వృద్ధి(బ్రీడింగ్‌)ని అడ్డుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రం కోరింది. కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. పౌర సంస్థలు, పౌరులు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన నిపుణుల కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంది.

Read Also : Petrol Diesel Prices : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు, లీటర్‌పై ఎంత తగ్గిందంటే..