స్వయంకృషి: మేయరు పీఠమెక్కిన చెత్తఎత్తుకునే యువకుడు

చండీఘడ్ : పంజాబ్ లోని చండీగఢ్ మున్సిపల్ కార్పేరేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేష్ కాలియా నగర మేయర్ గా ఎన్నికయ్యారు. 46 ఏళ్ల కాలియా వాల్మీకిసామాజిక వర్గానికి చెందిన వారు. ఒకప్పుడు పొట్టకూటి కోసం నగర వీధుల్లో చెత్త ఏరుకునే కాలియా నేడు అదే చండీగఢ్ నగర మేయర్ పీఠాన్ని ఎక్కారు. చెత్త ఏరుకుని కొన్నాళ్ళు, ఆటో డ్రైవర్ గా కొన్నాళ్లు, ఇలా చేతికి దొరికిన పని చేసి జీవితాన్ని గడిపిన కాలియా స్వయంకృషితో నేడు నగర మేయర్ గా ఎన్నికయ్యారు. చండీగఢ్ ను అత్యంత సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కాలియా హామీ ఇచ్చారు.
కాలియా స్వస్ధలం హర్యానాలోని సోనిపట్ జిల్లా అహులానా గ్రామం. తండ్రి కుందన్ లాల్ స్వీపర్ గా పనిచేసేవారు. 1977 లో వారి కుటుంబం చండీగఢ్ వచ్చి స్ధిరపడింది. ఇల్లు గడవటం కష్టంగా ఉండటంతో ప్రతిరోజు స్కూల్ అయిపోగానే తన నలుగురు సోదరీమణులు, ఇద్దరు సోదరులతో కలిసి వీధుల్లో చెత్త ఏరుకోటానికి వెళ్లేవాడు. అలాచెత్త ఏరుకుంటూనే కుటుంబానికి అండగా ఉంటూ ,12 వతరగతి వరకు చదివిన కాలియా పెళ్లయ్యాక కొంత కాలం ఆటో నడిపాడు. ఆర్ఎస్సెఎస్ కార్యకర్త కూడా అయిన కాలియా ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరుఫున 7 వార్డు నుంచి పోటీ చేశారు. జనవరి 19 న జరిగిన ఎన్నికల్లో మొత్తం 27 ఓట్లకు గాను 16 ఓట్లు దక్కించుకుని మేయర్ స్ధానాన్ని అధిరోహించారు. గత ఏడాది చండీగఢ్ కార్పోరేషన్ చెత్త సేకరించే పనిని ఓ ప్రయివేటు సంస్ధకు అప్పగిస్తూ తీసుకున్ననిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు కాలియా నాయకత్వం వహించారు.