Chhattisgarh : రోడ్డు పక్కన గొయ్యిలో పడిన ప్రైయివేట్ కంపెనీ బస్సు.. 12 మంది మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది.

Chhattisgarh Bus Accident
Chhattisgarh Bus Accident : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి 40 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా కుమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు దుర్గ్ జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు. క్షతగాత్రులకు రాయ్‌పూర్, భిలాయ్ లోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు!
డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు షిప్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో బస్సు మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన సుమారు 40 అడుగుల గోతిలో పడిపోయింది. ఈ ఘటనపై దుర్గ్ జిల్లా కలెక్టర్ ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ.. ప్రమాదం సమయంలో బస్సు కార్మికులతో కిక్కిరిసి ఉందన్నారు. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకు అన్నిఏర్పాట్లు చేశామన్నారు.
Also Read : షాప్‌లో పనికి హెల్పర్ కావలెను.. రూ.25,000 జీతం.. ప్రకటన చూశారా?
బస్సు ప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ లో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడిన వారు త్వరలో కోవాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.