Chinna Jeeyar Swamy: ప్రజల అవసరాలను గుర్తించి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు
పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరువాత చినజీయర్ స్వామి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అన్నారు.

Chinna Jeeyar Swamy
Chinna Jeeyar Swamy : వికాస్ తరంగిణి, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (Vikas Tarangini, Jeeyar Educational Trust) ఆధ్వర్యంలో ప్రజల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే విధంగా సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan Award) గ్రహీత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) తెలిపారు. వికాస్ తరంగిణి, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రభుత్వం చినజీయర్ స్వామిని పద్మభూషణ్ పురస్కారంకు ఎంపిక చేసిన విషయం విధితమే. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రధానం కన్నుల పండువగా జరిగింది. చినజీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ((President Draupadi Murmu) చేతులుమీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

Chinna Jeeyar Swamy
పద్మభూషణ్ అవార్డు అందుకున్న తరువాత చినజీయర్ స్వామి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే ఈ అవార్డు అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్పందించి, అందించే సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. “స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ” నినాదాన్ని మేం తీసుకొచ్చామని, ఎవరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని ఆచరించినా సరే సామాజిక సేవ విషయంలో అందరం కలసి పనిచేయాలన్నదే ఈ నినాదం లక్ష్యం అని చినజీయర్ స్వామి తెలిపారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ, ఇతర ధర్మాలను ఆదరిస్తూ కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా సేవ చేయాలన్నదే మా ఉద్దేశమని చెప్పారు.
ప్రకృతి కన్నెర్ర చేయడం ఉండదని, కానీ వైపరీత్యాలకు మనిషిలోని అత్యాశే కారణమని స్వామివారు పేర్కొన్నారు. ఒక జంతువు మరో జంతువును అవసరానికే చంపుతుంది. కానీ మనిషి మాత్రం అత్యాశతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నాడని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే మాటను “సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ”గా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చినజీయర్ స్వామి తెలిపారు. భగవంతుడు గుడికి, గుండెకు మాత్రమే పరిమితం కాదని, భగవంతుడు సర్వాంతర్యామి అన్నారు. ప్రపంచమే ఆయన శరీరం, ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా భగవంతుడి శరీరానికి హాని కలిగినట్టుగా భావించి, మనం సేవ చేయాలని చెప్పారు.
మహిళలకు గర్భకోశ క్యాన్సర్ల విషయంలో వికాస తరంగిణి ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, నేపాల్‌లో సుమారు 20 లక్షల మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, 6-7 లక్షల మందికి చికిత్స అందించామని చినజీయర్ చెప్పారు. పద్మభూషణ్ అవార్డు ద్వారా మనం చేసే సేవా కార్యక్రమాలపై బాధ్యత, జవాబుదారీతనం మరింత పెరిగిందని అన్నారు. మరింత మెరుగ్గా, నేర్పరితనంతో సామాజిక అవసరాలను గుర్తించి, స్పందించడం బాధ్యతగా భావించాలని చినజీయర్ స్వామి అన్నారు.