రగులుతున్న అసోం : బిల్లుపై మోడీ భరోసా.. ఆగని ఆందోళనలు

అసోం రగిలిపోతోంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. ఎక్కడా చూసిన ఆందోళకారుల నిరసనల జ్వాలతో అట్టుడికిపోతోంది. అసోం ప్రజలకు ఎలాంటి భయంలేదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినప్పటికీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పౌరసత్వ బిల్లుతో ముస్లీం యేతర అక్రమ వలసదారులు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి దేశంలోకి చొరబడే అవకాశం ఉందని వ్యతిరేకిస్తున్నారు.
ఆగని ఆందోళనలతో పారామిలటరీ బలగాలు మోహరించాయి. వేలాది మంది ప్రజలు ఆందోళనలను ఉధృతం చేసిన నేపథ్యంలో గువహటిలో కర్ఫ్యూ విధించారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో నిరసనకారులపై బాష్ప వాయువులను ప్రయోగించారు. పోలీసు కాల్పుల్లో ఆందోళనకారులు గాయపడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. గువాహటిలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపురలో ఆందోళనలు తీవ్రతరమైయ్యాయి. త్రిపురలో ఆర్మీ శాంతియుత మార్చ్ లు ప్రదర్శించినప్పటికీ, మేఘాలయ రాజధాని షిల్లాంగ్ సహా ఇతర ప్రాంతాల్లోని కమర్షియల్ సెంటర్ హా పలు షాపులను నిరసనకారులు ధ్వంసం చేశారు. వాహనాలను దహనం చేశారు.రాజ్యసభలో బిల్లుకు ఆమోదం అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు :
మోడీ ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB)పై విపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురువుతోంది. ఈ క్రమంలో అసోం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో భగ్గుమంది. భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రోడ్డుమీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది. మరోవైపు అసోంలోని పది జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ప్రధాన నగరమైన గువహటిలో మాత్రం కర్ఫ్యూ విధించారు.
త్రిపురలో కూడా ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. బీజేపీ హిందుత్వ అజెండాలో భాగంగా ముస్లింలపై వివక్షతను చూపిస్తోందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఆందోళనలతో అసోం, త్రిపురలో విమాన, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. కర్ఫ్యూ ఉత్తర్వులను ధిక్కరించి లాలుంగ్ గావ్ ప్రాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి.
ఎందుకీ వ్యతిరేకతంటే? :
కొన్ని ఏళ్లుగా పక్క దేశమైన బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఈశాన్య భారతంలోని వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండానే సులభంగా పౌరసత్వం లభిస్తుంది. అంటే.. శరణార్థులు కావొచ్చు అక్రమ వలసదారులు కావొచ్చు.. వీరంతా భారత పౌరసత్వాన్ని పొందుతారు. తద్వారా ఎప్పటినుంచో అక్కడే జీవిస్తున్న ఇతర నివాసులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
దీంతో అక్కడి ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ ఈ బిల్లు ముస్లిం శరణార్థులకు మాత్రం వర్తించదు. ఇదివరకే అసోం పౌర రిజిస్టర్ కారణంగా చాలామంది అక్కడి నివాసులు దేశ పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దశాబ్ద కాలంగా నివాసముంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమౌంతుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే ఈశాన్య రాష్ట్ర ప్రజలంతా బిల్లును వ్యతిరేకిస్తున్నారు.