Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు..

వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఇరువురు ఎంపీలు ప్రకటించారు.

Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు..

Updated On : April 4, 2025 / 6:58 PM IST

Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావెద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, ముస్లిం సమాజం మతపరమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తూ వక్ఫ్ ఆస్తులపై ఏకపక్ష ఆంక్షలు విధించిందని పిటిషన్ లో పేర్కొన్నారు ఎంపీలు. బిల్లులోని నిబంధనలు ముస్లింలు, ముస్లిం సమాజం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాయని అన్నారు.

వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఇరువురు ఎంపీలు ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధంగా వక్ఫ్‌ చట్టంలో మార్పులు చేశారని వారు ఆరోపించారు. 1995 చట్టానికి అనేక మార్పులు చేసి.. రాజ్యాంగంలోని 14, 25, 26, 29, 300ఎ అధికరణాలు ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉన్నందున.. వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు ఎంఐఎం, కాంగ్రెస్‌ ఎంపీలు.

Also Read : దేశంలో వక్ఫ్ సంపద మొత్తం ఎంత.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులున్నాయి..?

”ఈ సవరణలు ఆర్టికల్ 300A కింద రక్షించబడిన ఆస్తి హక్కులను బలహీనపరుస్తాయి. మతపరమైన ఆస్తి నియంత్రణను లౌకిక అధికారులకు బదిలీ చేయడం మతపరమైన, ఆస్తి హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఈ చట్టం విరుద్ధంగా ఉంది. ప్రతిపాదిత చట్టంలోని నిబంధనలు ఇతర మతపరమైన నిధుల పాలనలో భాగం కాని ఆంక్షలను విధించడం ద్వారా ముస్లింలపై వివక్ష చూపుతున్నాయి.

హిందూ, సిక్కు మత ట్రస్టులు కొంతవరకు స్వీయ నియంత్రణను అనుభవిస్తున్నప్పటికీ.. వక్ఫ్ చట్టం, 1995కు చేసిన సవరణలు వక్ఫ్ వ్యవహారాల్లో రాష్ట్ర జోక్యాన్ని అసమానంగా పెంచుతాయి. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘిస్తుంది” అని ఎంపీ జావెద్ అన్నారు.

Also Read : వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు.. అసలు ఏంటిది? ఈ బిల్లులో ఏముంది?

వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో 128 మంది సభ్యులు అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందింది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు 288 మంది సభ్యులు మద్దతివ్వగా, 232 మంది ఎంపీలు వ్యతిరేకించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల ఎంపీలు.