లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు.. అసలు ఏంటిది? ఈ బిల్లులో ఏముంది?

వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశం.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, నిర్వహించడంలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడం. భారతదేశంలో వక్ఫ్‌ ఆస్తుల అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచడం.

లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు.. అసలు ఏంటిది? ఈ బిల్లులో ఏముంది?

Updated On : April 2, 2025 / 1:21 PM IST

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు గురించి విపక్షాలు వదంతులు ప్రచారం చేశాయని అన్నారు. బిల్లులో లేని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు. వక్ఫ్‌ చట్టం తొలిసారి 1954లో అమల్లోకి వచ్చిందని కిరణ్ రిజిజు వివరించారు. సవరణ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని అన్నారు.

కాగా, ఎనిమిది గంటల పాటు ఈ సవరణ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌ ఉంటుంది. ఆమోదం పొందాక రాజ్యసభకు పంపుతారు. ఈ బిల్లును 2024 ఆగస్టులోనే లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలియజేయడంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలన కోసం పంపింది. అనంతరం ఈ కమిటీ పలు ప్రతిపాదనలు చేస్తూ దీనికి ఆమోద ముద్ర వేసింది.

Also Read: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు? గత ట్రెండ్స్ బట్టి చూస్తే..

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లులో ఏముంది?
వక్ఫ్ సవరణ బిల్లు ఉద్దేశం.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంలో, నిర్వహించడంలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడం. భారతదేశంలో వక్ఫ్‌ ఆస్తుల అడ్మినిస్ట్రేషన్, మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచడం.

ఈ సవరణ బిల్లును ఆమోదింపజేసుకుని, అందులోని అంశాల ఆధారంగా వక్ఫ్‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావాలని కేంద్ర సర్కారు భావిస్తోంది.

పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని చేస్తూ బిల్లును తీసుకొచ్చారు. 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో సుమారు 40 సవరణలు తీసుకొస్తున్నారు. ముస్లిం సమాజం నుంచి వచ్చిన డిమాండ్ల ఆధారంగా ఈ మార్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో మార్పులు చేస్తారు. ఈ సంస్థల్లో ముస్లిం మహిళలు, ముస్లిమేతర సభ్యులను చేర్పిస్తారు.

వక్ఫ్ చట్టం 1995ను యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ చట్టం 1995గా పేరు మార్చుతారు.

వక్ఫ్ భూమిని సర్వే చేసే అధికారం ఆ జిల్లా కలెక్టర్‌కు లేదా డిప్యూటీ కమిషనర్‌కు బదలాయిస్తారు.

వక్ఫ్ ఆస్తుల నమోదు, ఆడిట్ వివాదాల పరిష్కారంలో టెక్నాలజీని ప్రవేశపెట్టి, పారదర్శకతను పెంచుతారు. ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ సెంట్రల్ పోర్టల్, డేటాబేస్ ద్వారా ఉంటుంది.

ఆస్తి వక్ఫ్‌కి చెందినదా లేదంటే ఇతరులకు చెందిందా? అన్న విషయాన్ని నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. ముగ్గురు సభ్యుల వక్ఫ్ ట్రైబ్యునల్ ఇక ఇద్దరు సభ్యులకి పరిమితం అవుతుంది. అయినప్పటికీ ఈ ట్రైబ్యునల్ నిర్ణయం తుది నిర్ణయం కాదు. ఆ నిర్ణయాలను 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయొచ్చు.