ఆపరేషన్ సిందూర్ గురించి రక్షణ మంత్రి అన్నీ చెప్పారు.. ఇది మాత్రం చెప్పలేదు: లోక్‌సభలో ప్రియాంక గాంధీ
"కశ్మీర్‌లో పరిస్థితులు చాలా మారిపోయాయని కేంద్ర సర్కారు చెబుతోంది. కశ్మీర్‌లో శాంతి భద్రతలు నెలకొన్నాయని మోదీ చాలాసార్లు చెప్పారు" అని అన్నారు.

ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడారు. “నిన్న రక్షణ మంత్రి గంటసేపు మాట్లాడారు. ఆ సమయంలో దేశాన్ని రక్షించడం, ఉగ్రవాదం గురించి చెప్పారు. చరిత్రకు సంబంధించిన పాఠం కూడా చెప్పారు. కానీ ఒక విషయం మిగిలిపోయింది. ఈ పహల్గాం దాడి ఎలా జరిగింది?
“కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ నెహ్రూ, ఇందిరా గాంధీ ఏమి చేశారన్నది చెప్పారు. నా తల్లి కన్నీళ్ల గురించి కూడా చెప్పారు. కానీ కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారన్నదానికి మాత్రం సమాధానం చెప్పలేదు…” అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.
“కశ్మీర్ వెళ్లాలని, అక్కడ భూములు కొనాలని మోదీ అంటున్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు చాలా మారిపోయాయని కేంద్ర సర్కారు చెబుతోంది. కశ్మీర్‌లో శాంతి భద్రతలు నెలకొన్నాయని మోదీ చాలాసార్లు చెప్పారు. మరి దాడులు ఎందుకు జరుగుతున్నాయి?” అని అన్నారు.
“ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ సైన్యాధిపతి అమెరికా అధ్యక్షుడిని కలిశారు. మరి ఆ సమయంలో మన దౌత్యనీతి ఏమైంది? 2024లో టీఆర్‌ఎఫ్ దాడిలో తొమ్మిది మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. టీఆర్ఎఫ్ వరుసగా దాడులు చేస్తుంటే కేంద్ర సర్కారు ఏం చేస్తోంది?
ఈ ప్రభుత్వం ఎప్పుడూ ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది… దేశ పౌరుల పట్ల ఏ బాధ్యతా భావం లేదు. నిజం ఏమిటంటే.. ఈ ప్రభుత్వ పెద్దల మనసులో ప్రజలకు స్థానం లేదు. ఈ ప్రభుత్వ పెద్దలకు ప్రతీది రాజకీయమే, ప్రచారమే…” అని అన్నారు.