Corona Virus : దేశంలో స్థానిక దశకు చేరుకుంటున్న కరోనా..వైరస్‌తో కలిసి జీవించాల్సిందే
దేశంలో కరోనా స్థానిక దశకు చేరుకుంటోంది. ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. మహమ్మారి కాస్త ఎండెమిక్ స్టేజ్‌కు చేరుకుంటోందన్నారు.

Corona
Corona virus in india : కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ ముగిసింది.. ఇక థర్డ్ వేవ్ మొదలైపోతుంది.. సెప్టెంబరు, అక్టోబరులో మొదలై… నవంబరులో పీక్స్‌కు చేరుకుంటుంది… ఇలా రకరకాల లెక్కలు, అంచనాలతో నిపుణుల హెచ్చరికలు ప్రజలను భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ తీయని కబురు.. నిజంగానే భారతదేశానికి ఇది గుడ్ న్యూసే. అదేంటంటే.. దేశంలో కరోనా స్థానిక దశకు చేరుకుంటోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ప్యాండమిక్ కాస్త ఎండెమిక్ స్టేజ్‌కు చేరుకుంటోందని అన్నారు.
ప్రస్తుతం దేశంలో తక్కువ, మధ్యస్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ అంచనా వేసింది. ఒక దేశ జనాభా వైరస్‌తో జీవించడం నేర్చుకోవడాన్నే స్థానిక దశ అంటారు. అంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం.. ఓ సాధారణ వైరస్‌గా మారిపోవడం అన్న మాట. భారతదేశానికి సంబంధించినంత వరకు, దేశ పరిమాణం, జనాభా, వైవిధ్యం నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రోగ నిరోధక శక్తి వివిధ దశల్లో కనిపిస్తోందని సౌమ్య స్వామినాథన్ వివరించారు. చాలా వరకు కేసుల పరిస్థితుల్లో పెరుగుదల, తగ్గుదల కొనసాగవచ్చన్నారు.
దేశంలో ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సమయంలో తక్కువ ప్రభావితమైన వివిధ ప్రాంతాల్లో, ప్రత్యేకించి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో, తక్కువ స్థాయిలో టీకా కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో రాబోయే నెలల్లో కరోనా కేసుల పెరుగుదల నమోదు కావచ్చు. పిల్లల్లో కరోనా వ్యాప్తిపై తల్లిదండ్రులు టెన్షన్ చెందాల్సిన అవసరం లేదని సౌమ్య స్వామినాథన్ అన్నారు. పిల్లలకు కరోనా సోకినా పెద్దగా ప్రభావం లేదనే విషయం పలు సర్వేల ద్వారా తెలుస్తోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 చివరి నాటికి 70 శాతం మేర కరోనా టీకా కవరేజీని సాధించవచ్చని, ఆ తర్వాత దేశాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నామని అన్నారామె.
ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్‌మిషన్ రేటు తక్కువగా ఉంది. వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాబోయే కాలంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసులు ఎక్కువ సంఖ్యలో వెలుగు చూస్తాయని అంటున్నారు. ప్రజల్లో వైరస్ ఓ భాగమైపోతుందని, జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగించవచ్చని చెబుతున్నారు. థర్డ్ వేవ్ గురించి ఎలాంటి అంచనాలు వేయడం సాధ్యం కాదని, ఎప్పుడొస్తుంది… ఎలా వస్తుంది… ఎంత తీవ్రంగా ఉంటుందని చెప్పడానికి ఎవరి దగ్గరా మంత్రదండం లేదని సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు.