వీళ్లేం మనుషులు : కరోనా వారియర్స్ పై కనికరం చూపని జనం

కరోనా వైరస్ ధాటికి ప్రజలు ఎంతగా భయపడుతున్నారంటే.. విధి నిర్వహణలో ఉన్న కరోనా వారియర్స్ రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కరోనా విధుల్లో ఉన్న పారా మెడికల్ సిబ్బందికి సహాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ అమానవీయ ఘటన మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో జరిగింది.
పీపీఈ కిట్లు ధరించిన పారా మెడికల్ సిబ్బంది కరోనా రోగులను చికిత్స నిమిత్తం జిల్లాలోని టీవీ ఆస్పత్రి నుంచి బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం తిరిగి ఆస్పత్రికి బయలు దేరారు. ఈ క్రమంలో వారిలో ఒక వ్యక్తి ఉన్నట్లుండి రోడ్డుపై పడిపోయాడు.
ఆసమయంలో అతడికి రక్షణగా నిలవాల్సిన సహోద్యోగులు అతడిని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాదాపు 25 నిమిషాల పాటు ఆ వ్యక్తి రోడ్డుపై అచేతనంగా పడి పోయి ఉన్నాడు. రోడ్డుపై వెళ్లే వాళ్లు కూడా అలా చూస్తూ వెళ్లారే తప్ప అతడిని ఆస్పత్రిలోకి తీసుకు వెళ్లేప్రయత్నం చేయలేదు. సమచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.