భారత్ లో 53వేలకు చేరువలో కరోనా కేసులు…28శాతం దాటిన రికవరీ రేటు

చాప కింద నీరులా దేశంలో కోవిడ్-19 విస్తరిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 15,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1,783 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ గడిచిన 5రోజుల్లోనే దాదాపు 10,000కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. టెస్టింగ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుండటంతో కరోనా కేసులు వేగంగా బయటపడుతున్నాయని తెలిపింది. భారత్ లో ఇప్పటివరకు 12లక్షలకు పైగా శాంపిల్స్ కు కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ,రాజస్థాన్ కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 29 వేల కరోనా కేసులు ఈ మూడు చోట్లనే నమోదయ్యాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదు కాగా, 651 మంది మృతిచెందారు. ఇక,దేశంలో తొలి వైరస్ కేసు నమోదైన కేరళలో మాత్రం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేరళలో 503 కరోనా కేసులు నమోదుకగా, 469 మంది కోలుకున్నారు. కేవలం నలుగురు మృతిచెందారు. ఇక కరోనాపై భారత పోరాటంలో ఓ సానుకూల అంశం కన్పిస్తోంది.
దేశవ్యాప్తంగా రికవరీ రేటు(కోలుకుంటున్న వారి శాతం)28శాతం దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన 52,952కేసుల్లో..15,267మంది కోలుకున్నట్లు తెలిపింది. దీంతో భారత్ రికవరీ రేటు 28.83శాతంగా ఉన్నట్లు తెలిపింది. కేరళ రాష్ట్రంలోనే అత్యధిక రికవరీ రేటు(93శాతం)ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఒక్క రాజస్థాన్ లోనే అత్యధిక రికవరీ రేటు(48శాతం)ఉంది. ఇక మహారాష్ట్రలో అత్యల్పంగా 16శాతం రికవరీ రేటు ఉన్నట్లు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read | దేశంలో 50వేలకు చేరువలో కరోనా కేసులు