కరోనా టెన్షన్…చైనీయులకు ఆన్ లైన్ వీసా సేవలు నిలిపివేసిన భారత్

చైనాలో వౌహాన్ సిటిలో గత నెలలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ 300మంది ప్రాణాలు తీసి…ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్… చైనాలోని వూహాన్ లో నివసిస్తున్న మన దేశీయులను శనివారం, ఆదివారం రెండు ప్రత్యేక విమానాల ద్వారా 654మందిని తీసుకొచ్చి వారిని మానెసర్ క్యాంపుకు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
ఇప్పటికే భారత్ లోని కేరళలో రెండు కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో మరింత అప్రమత్తమైన కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పర్యాటకులకు, చైనాలో నివసించే విదేశీయులకు మనదేశంలో పర్యటించేకు ఇచ్చే ఈ-వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిణామాల కారణంగా, ఈ-వీసాలపై భారతదేశానికి ప్రయాణాన్ని తాత్కాలికంగ నిలిపివేశామని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
చైనీస్ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నవారికి, చైనాలో నివసిస్తున్న ఇతర దేశస్థుల దరఖాస్తుదారులకు ఇది వర్తిస్తుందని, ఇప్పటికే జారీ చేసిన ఈ-వీసాలు ఉన్నవారు ఇకపై అవి చెల్లుబాటు కావని గమనించాలని ఆ ప్రకటనలో భారత రాయబార కార్యాలయం తెలిపింది. భారతదేశాన్ని సందర్శించడానికి బలవంతపు కారణం ఉన్న వారందరూ బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా షాంఘై లేదా గ్వాంగ్‌జౌలోని భారత కాన్సులేట్‌లను, అలాగే ఈ నగరాల్లోని భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలను సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో తెలిపింది.