కరోనా కొత్త స్ట్రెయిన్.. పిల్లలకు రిస్క్ ఎక్కువే!

కరోనా కొత్త స్ట్రెయిన్.. పిల్లలకు రిస్క్ ఎక్కువే!

Updated On : December 22, 2020 / 5:54 PM IST

Coronavirus strain: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ విస్తరిస్తూ ఉండగా.. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులందరూ విమానాశ్రయాల్లో RTPCR పరీక్షలు తప్పనిసరి చేస్తూ పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే లేటెస్ట్‌గా ఈ వైరస్ విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్రిటన్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ పిల్లలకు సాధారణం కంటే ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్ స్ట్రెయిన్ పిల్లలకు త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లుగా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. దక్షిణ బ్రిటన్‌లో ఈ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాల్చగా.. పిల్లలకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వైరాలజీ నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కరోనా వైరస్ ఎక్కువగా పెద్దలపైనే ప్రభావం చూపగా.. కొత్త స్ట్రెయిన్ మార్పు చెందినట్లుగా అధికారులు అంచనా వేశారు. కొత్త స్ట్రెయిన్‌తో చిన్నారులకు మహమ్మారి ముప్పు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ స్ట్రెయిన్ పిల్లల్లో శరీర కణాల్లోకి ప్రవేశించగానే వైరస్‌కు సంబంధించిన మార్పులు మొదలవుతున్నట్లు చెప్తున్నారు.

చిన్నారులతోపాటు పెద్దల్లోనూ రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఈ వైరస్ వల్ల ఎక్కువగా ఉందని వైరాలజీ స్పెషలిస్ట్, వైరస్ అడ్వయిజరీ గ్రూప్ సభ్యుడు వ్యాండీ బార్క్‌లే వెల్లడించారు. కొత్త స్ట్రెయిన్ చిన్నారుల శరీర కణాలలోకి ప్రవేశించిన తర్వాత సులభంగా మార్పుచెందుతుందని, దీనిపై తాము మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అయితే కొత్తరకం కరోనా మరింత ప్రాణాంతకమైందని చెప్పడానికి ఎటువంటి ఆధారాల్లేవు కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తే అత్యంత సులువుగా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.