COVID-19 : లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేస్తారా ? 

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 01:09 AM IST
COVID-19 : లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేస్తారా ? 

Updated On : April 3, 2020 / 1:09 AM IST

భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. 2020, మార్చి 25వ తేదీ నుంచి ఇది అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా..ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడనే రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 2020, ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు కానుంది.

గడువు సమీపిస్తుండడంతో అందరి దృష్టి  లాక్ డౌన్ పై నెలకొంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. మరి ఈ తరుణంలో లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

దేశవ్యాప్త దిగ్బందాన్ని దశలవారీగా ఎత్తివేసే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

దశలవారీగా ఎత్తివేసేందుకు ఒక పకడ్బంది వ్యూహాన్ని రచించాలని సీఎంలతో ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన సూచనలు ఉంటే తెలియచేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న రోజుల్లో మరింత దృష్టి పెట్టాలని సూచించారు. నిర్ధారణ పరీక్షల టెస్ట్, అనుమానితుల గుర్తింపు, ఐసోలేట్ చేయడం, క్వారంటైన్ చేయడం..ఇతరత్రా అంశాల వారిపై నిశితంగా గమనించాలన్నారు.

ప్రాణనష్టాన్ని అత్యంత కనిష్టస్థాయికి చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఏప్రిల్ 14వ తేదీన కాలం ముగిసిన తర్వాత సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నించాలన్నారు.(టెన్షన్ టెన్షన్ : తెలంగాణ కరోనా @ 154 కేసులు)

ముఖ్యమంత్రుల సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, పలు కీలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్ సహా దేశంలో కోవిడ్ – 19 కేసులు ఎలా విస్తరించాయనే దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ వివరించారు. 
కొన్ని రాష్ట్రాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాల్సి ఉందని షా వ్యాఖ్యానించారు.