బీహార్ లో పొలిటికల్ హీట్ : నా గుండెను చీల్చితే మోడీ కనిపిస్తాడు…బీజేపీకి తలనొప్పిగా చిరాగ్ పాశ్వాన్

Chirag Paswan solo fight in bihar elections మరో 10రోజుల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి ప్రధాన రాజకీయపార్టీలు. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. బీహార్‌లో అంతో ఇంతో ఆదరణ ఉన్న లోక్ జనశక్తి పార్టీ(LJP)… నితీష్ కుమార్ తో విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుండటంతో రాజకీయ విశ్లేషకులకు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు.
గత వారం, రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో దళిత ఓటు బ్యాంక్ గట్టిగా ఉన్న LJP పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లు అయింది. అయితే దురదృష్టవశాత్తూ ఆయన మరణించడంతో పార్టీ బాధ్యతను, ప్రచార బాధ్యతను ఆయన కుమారుడు చిరాగ్ తన భుజాన వేసుకున్నారు. రామ్ విలాన్ పాశ్వాన్ సభ నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు పాశ్వాన్ మరణంతో ఆ శూన్యత కన్పిస్తోంది. 37ఏళ్ల చిరాగ్ పాశ్వాన్… తండ్రిలా జనాన్ని ఆకర్షించడంలో ఇంకా వెనకబడినట్లే కనిపిస్తోంది.
మరోవైపు,ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని తన తండ్రే నిర్ణయం తీసుకున్నారని, అలాగైతేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటాయని అనుకున్నారని చిరాగ్ అన్నారు. ఎన్‌డీఏ నుంచి విడిపోయినప్పటికీ బీజేపీతో పొత్తుకు కట్టుబడే ఉన్నామని పేర్కొన్నారు. నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామన్నారు. నితీశ్‌కుమార్ మరో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితే బీహార్ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని చిరాగ్ అన్నారు.
అయితే, తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఇమేజ్ ను చిరాగ్ పాశ్వాన్ వాడుతుంటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నాయకుల పేర్లను వాడుకుంటూ ప్రజలను చిరాగ్ పాశ్వాన్ తప్పుదోవపట్టిస్తున్నాడంటూ కేంద్రమంత్రులతో సహా బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. బీజేపీ విమర్శల దాడి నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-16,2020)చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ…బీజేపీ నాయకులు చేసిన కామెంట్లతో తాను హర్ట్ అయ్యానని అన్నారు. నరేంద్రమోడీ తన రాముడని..తాను ఆంజనేయుడినని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ప్రధాని మోడీ ఫొటోలు తనకు అక్కర్లేదని…హనుమంతుడిలో గుండెల్లో రాముడు ఏ విధంగా ఉంటాడో…తన గుండెను చీల్చినా మోడీ కనిపిస్తాడని వ్యాఖ్యానించాడు.
నితీష్ కుమార్ కే ప్రధాని ఫొటోలు ఎక్కువగా అవసరమవుతాయని విమర్శించారు. తన తండ్రి మరణం తర్వాత సీఎం నితీష్ కుమార్ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో చిరాగ్ పాశ్వాన్ ఫైర్ అయ్యారు. నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామన్నారు.తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని, ఆయన ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు చిరాగ్.. ఆయన పాటించిన విలువలను కొనసాగిస్తూ ముందుకు వెళతానని చెప్పారు. ఎన్నికల తర్వాత జేడీయూ లేని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని చిరాగ్ పాశ్వాన్ సృష్టం చేశారు.