MCD Mayoral Polls: కేజ్రీవాల్ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆమోదం.. 16న మేయర్ ఎన్నిక..
జనవరి 6, జనవరి 24, ఫిబ్రవరి 6న మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంసీడీ మూడుసార్లు సమావేశమైంది. కానీ ప్రతిసారి సెషన్ రాజకీయ ప్రతిష్టంభనతోనే ముగిసింది. ఫిబ్రవరి 16న మరోసారి మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.

MCD Mayoral Polls
MCD Mayoral Polls: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు విఫలమైంది. తాజాగా ఈనెల 16న మరోసారి మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 16న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కొలువు దీర్చి నూతన మేయర్ ఎన్నిక నిర్వహించాలంటూ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. దీంతో ఈనెల 16న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశమై నూతన మేయర్‌ను, ఢిప్యూటీ మేయర్ ను, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనుంది.
జనవరి 6, జనవరి 24, ఫిబ్రవరి 6న మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంసీడీ మూడుసార్లు సమావేశమైంది. కానీ ప్రతిసారి సెషన్ రాజకీయ ప్రతిష్టంభనతోనే ముగిసింది. జనవరి 6న తొలిసారి సమావేశంలో ఆప్, బీజేపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో మేయర్ ఎన్నిక రద్దయింది. జనవరి 24న జరిగిన రెండో సమావేశానికి సభలో ఇదే విధమైన పరిస్థితి ఏర్పడటంతో మరోసారి ఎన్నిక వాయిదా పడింది. మూడోసారి కూడా బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల వాగ్వావాదంతో సభ ప్రారంభమైన 45 నిమిషాల్లోనే వాయిదా పడింది.
ఇదిలాఉంటే.. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 16న ఉదయం 11గంటలకు డాక్టర్ ఎస్పీ ముఖర్జి సివిక్ సెంటర్‌లోని A బ్లాక్, 4వ అంతస్తులో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశమవుతుందని, ఆ సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరుగుతుందని, ఈ మేరకు సీఎం చేసిన సిఫారసుకు తాను ఆమోదం తెలిపానని ఎల్జీ ప్రకటనలో పేర్కొన్నారు.