వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Farm Laws: విపక్షాల తీవ్ర ఆందోళనల నడుమ సెప్టెంబర్ లో పార్లమెంట్ ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఛత్తీస్‌గఢ్ కిసాన్ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు వినేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(అక్టోబర్-12,2020) కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం, ఒప్పంద వ్యవసాయ చట్టంతో పాటు నిత్యావసర వస్తువుల సవరణ చట్టాలను తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రతో సెప్టెంబరు 27 నుంచి ఈ నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ చట్టాలను కాంగ్రెస్ సహా పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణాలో ఖేతీ బచావో యాత్ర చేపట్టారు. హర్యానా,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.