Flight Emergency Landing: తృటిలో తప్పిన మరో విమాన ప్రమాదం.. మే డే కాల్ తో 168 మంది ప్రయాణికులు సురక్షితం.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
ఎమర్జెన్సీ కాల్ అందిన వెంటనే.. ఆన్-గ్రౌండ్ సిబ్బందిని ఏటీసీ అప్రమత్తం చేసింది. వారు వెంటనే చర్యలు తీసుకున్నారు.

Flight Emergency Landing: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాల్లోకి లేచిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఓ బిల్డింగ్ పై నేలకూలింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్లేన్ లో ఉన్న వారిలో ఒక్కరు మినహా అంతా చనిపోయారు. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది 242 మంది ఉన్నారు. 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిరిండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా పెను విషాదమే నింపింది. అత్యవసర పరిస్థితిలో పైలట్ మేడే కాల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. విమానం నేలకూలడం, అందులో ఉన్న వారు మంటల్లో కాలిపోవడం అన్నీ జరిగిపోయాయి.
ఎయిరిండియా ప్లేన్ విషయంలో మేడే కాల్ పని చేయకపోయినా.. మరో విమానం విషయంలో మాత్రం పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ‘మేడే కాల్’తో సురక్షితంగా బయటపడింది. గౌహతి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది.
ఇండిగో విమానం గౌహతి నుంచి చెన్నైకి బయలుదేరింది. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికి అందులో ఫ్యూయల్ తక్కువగా ఉండడాన్ని పైలట్ గుర్తించాడు. వెంటనే ఏటీసీకి ‘మేడే’ సందేశం పంపాడు. ఆ వెంటనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. దీంతో విమానానికి ప్రమాదం తప్పింది.
”6E-6764 (A321) విమానం పైలట్ గురువారం సాయంత్రం 7:45 గంటలకు చెన్నైలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ల్యాండింగ్ గేర్ రన్‌వేను తాకిన తర్వాత “చుట్టూ తిరగాలని” నిర్ణయించుకున్నాడు. దీన్ని ‘బాల్క్డ్ ల్యాండింగ్’ అని పిలుస్తారు. విమానం సాయంత్రం 4:40 గంటలకు గౌహతి విమానాశ్రయం నుండి బయలుదేరింది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ కి దాదాపు 35 మైళ్ల దూరంలో ఉన్న సమయంలో కెప్టెన్ మేడే కాల్ పంపాడు. ఆకస్మికంగా విమానం కిందకు దిగుతున్న సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడ్డారు.
“ఎమర్జెన్సీ కాల్ అందిన వెంటనే ఏటీసీ అప్రమత్తమైంది. ఆన్-గ్రౌండ్ సిబ్బందిని అలర్ట్ చేసింది. వారు తక్షణమే చర్యలు తీసుకున్నారు. వైద్య, అగ్నిమాపక సేవల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8.20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది” అని బెంగళూరు విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి.
ఏంటీ మేడే కాల్..
మేడే కాల్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడానికి దీన్ని వాడతారు. ఆపదలో ఉన్నాము తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా సముద్రంలో లేదా గాలిలో ప్రాణాంతక అత్యవసర పరిస్థితిని సూచించడానికి ఉపయోగించబడుతుంది.
ఈ పదం ఫ్రెంచ్ పదబంధం “మైడెజ్” నుండి వచ్చింది. దీని అర్థం “నాకు సాయం చేయి”. ఆవశ్యకతను నిర్ధారించడానికి మూడుసార్లు – “మేడే, మేడే, మేడే” అని రిపీట్ చేస్తారు. ఒక వ్యక్తి.. ఓడ, విమానం లేదా వాహనంలో ఉన్న సమయంలో తీవ్రమైన ప్రమాదంలో ఉన్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు, ఇంజిన్ వైఫల్యం లేదా ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితి వంటి తక్షణ సాయం అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. మేడే కాల్ అనేది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే వాడేది. దీని దుర్వినియోగం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.