న్యాయం కోర్టులు మాత్రమే చేయాలని రాజ్యాంగం చెప్పలేదు- మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం ప్రజల కష్టనష్టాలను తీరిస్తే కోర్టులకు వచ్చే అవసరం ఉండదు. కోర్టు పరిశీలించే అంశాలను ప్రభుత్వం వ్యతిరేకంగా విమర్శించేవిగా చూడాల్సిన అవసరం లేదు.

న్యాయం కోర్టులు మాత్రమే చేయాలని రాజ్యాంగం చెప్పలేదు- మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

Former CJI NV Ramana

Updated On : May 8, 2025 / 10:08 AM IST

Justice NV Raman: న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని సామాన్యులకు చేరువ చేయాలని, న్యాయ వ్యవస్థ ద్వారా ఉన్న ప్రయోజనాలను ప్రజలకు వివరించడం కోసం తాను చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తులను ప్రకటించడం మంచి పరిణామం అన్నారు. న్యాయమూర్తులు తమ ఆస్తులు ప్రకటించాలి, ఆస్తులు ప్రజలకు తెలియజేయాలనేది ఇంతకుముందే ఉందని గుర్తు చేశారు. తాను కూడా తన ఆస్తులను హైకోర్టు, సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో పెట్టానని తెలిపారు.

”చాలామంది న్యాయమూర్తులు తమ ఆస్తులను ప్రకటించారు. ఆస్తుల ప్రకటన న్యాయవ్యవస్థ పారదర్శకతను తెలియజేస్తుంది. న్యాయవ్యవస్థ ఎప్పుడూ పారదర్శకంగా ఉండాలని నేను కోరుకున్నాను. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలి. కోర్టులో కేసుల విచారణ ఆలస్యం వెనక ఉన్న కారణంపై ప్రభుత్వం, ప్రజలు ఆలోచన చేయాలి. కోర్టులకు మౌలిక సదుపాయాలు, న్యాయవాదుల లభ్యత కావాలి.

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కోసం చాలా చేయాలి. కోర్టులకు ప్రభుత్వం సహకరిస్తేనే కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అవుతాయి. కోర్టుల వల్లే కేసుల విచారణ ఆలస్యం జరుగుతుందని ప్రజలు అపోహలో ఉన్నారు. పార్లమెంట్ లో కోర్టులు, జడ్జిలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎంపీలు మాట్లాడకపోవడం దురదృష్టకరం. రాజ్యాంగం మూడు వ్యవస్థలకు లక్ష్మణ రేఖ గీసింది. ఎవరి పాత్ర వారు పోషించాలి.

Also Read: అమెరికా ఆపరేషన్ నెప్ట్యూన్ నుంచి భారత్ ఆపరేషన్ సిందూర్ వరకు.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన దేశాలు..

ప్రభుత్వం ప్రజల కష్టనష్టాలను తీరుస్తే కోర్టులకు వచ్చే అవసరం ఉండదు. కోర్టు పరిశీలించే అంశాలను ప్రభుత్వం వ్యతిరేకంగా విమర్శించేవిగా చూడాల్సిన అవసరం లేదు. న్యాయం కోర్టులు మాత్రమే చేయాలని రాజ్యాంగం చెప్పలేదు. మూడు వ్యవస్థలు సక్రమంగా పని చేస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. అమరావతిలో గత ప్రభుత్వ హామీలు నమ్మి రైతులు భూమి ఇచ్చారు. న్యాయ వ్యవస్థ ప్రభుత్వ చర్యలను రివ్యూ చేస్తుంది. అమరావతి రైతులకు న్యాయ వ్యవస్థ న్యాయం చేసింది” అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.