ఉద్యోగులకు 4శాతం డీఏ పెంచిన గవర్నమెంట్

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. డియర్‌నెస్ అల్లోవెన్స్‌ను 4శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఇది వర్తిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డీఏ పెంచినట్లు తెలిపారు. 4శాతం పెరగడమంటే కొత్త లెక్కల ప్రకారం.. రూ.పది వేలు జీతం తీసుకుంటున్న వారి వేతనం రూ.720పెరుగుతుంది.
ప్రస్తుతం కనీస వేతనంపై ఉన్న 17 శాతానికి అధికమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. డీఏ పెంపు వల్ల సుమారు 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జరగనున్నది. డీఏ పెంపు వల్ల కేంద్రంపై సుమారు 14వేల కోట్ల అదనపు భారం పడనున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సార్లు డీఏను పెంచుతూ ఉంటుంది. శుక్రవారం పెంచిన డీఏ 2020 తొలి అర్ధ భాగానికి సంబంధించింది.
డియర్‌నెస్ అల్లోవెన్స్.. ప్రభుత్వోద్యుగులు (రాష్ట్ర లేదా కేంద్ర)కు వచ్చే జీతంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునేవారికి నిత్యావసర వస్తువుల పెరుగుదల, గృహావసరాల ఖర్చు ఆధారంగా డీఏను పెంచుతారు. డీఏ అనేది పూర్తిగా ట్యాక్స్ పరిధిలోకే వస్తుంది. పైగా ఇది ఉద్యోగులు నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగుల కంటే సిటీల్లో ఉండే వారికి ఎక్కువగా ఉంటుంది.