లాక్‌డౌన్ వెనుక గవర్నమెంట్ అసలు ప్లాన్ ఇదే

లాక్‌డౌన్ వెనుక గవర్నమెంట్ అసలు ప్లాన్ ఇదే

Updated On : June 30, 2020 / 7:04 AM IST

లాక్‌డౌన్ సడలింపుల వల్ల రాకపోకలు పెరిగిపోవడం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ ప్రాంతాలకు వచ్చి వెళుతుండటంతో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించేందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇక, ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరులో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. మళ్లీ లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నారా ? చెప్పండి, లేదా ప్రభుత్వం, అధికారులు చెప్పినట్లు వింటారా ? అది మీరే తేల్చుకోండని కర్ణాటక సీఎం యడియూరప్ప వ్యాఖ్యానించడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా అనేక ప్రాంతాల ప్రజలు భౌతికదూరం పాటించడం లేదు. మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో నిబంధనలు గాలికి వదిలేసి తిరుగుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగారాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతోంది. మళ్లీ లాక్‌డౌన్‌కు దారి తీసేలా పరిస్థితులు దారితీస్తున్నాయి. అధికారులు చెప్పినట్లు అన్ని నియమాలు పాటించి కరోనా కట్టడికి సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ… ఎక్కువ మంది ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. లాక్‌డౌన్‌ అమలు చేసినంత మాత్రాన వైరస్‌ అదుపులోకి వస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ప్రజా సహకారం లేకుండా వైరస్‌ను అదుపు చేయడం సాధ్యమయ్యేది కాదు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాల్సిందే.

కరోనా వైరస్‌కు కచ్చితమైన ఔషధం ఇంకా అందుబాటులోకి రాలేదనే విషయం గుర్తించాలి. వ్యాక్సిన్‌ ఇప్పుడే అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు. పరిస్థితులను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న వైద్య వనరులు కూడా తక్కువ. పెద్ద ఎత్తున కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో వైద్యం అందించే పరిస్థితులుండవు. ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉండాల్సి వస్తుంది. అప్పుడైనా స్వీయ నియంత్రణతో మెలగాలి. ఇంట్లో వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు కొని తెచ్చుకొని ఆందోళన చెందే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితులు వైరస్‌ సోకేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున బయటకు అత్యవసరమైతే తప్ప రాకపోతేనే మంచింది. ఒకవేళ వచ్చిన భౌతిక దూరం, మాస్కుల వినియోగం తప్పనిసరి.

ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించాలన్న ఆలోచనల వెనుక చాలా కారణాలున్నాయి. కొన్ని చోట్ల కోలుకున్న వారి సంఖ్య కంటే వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీనివల్ల అందరికీ వైద్యం అందించడం కష్టమవుతోంది. ఇది ఇలానే కొనసాగితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కొంత అదుపు చేస్తే.. అప్పుడు యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ గ్యాప్‌లో వైరస్‌ సంక్రమణ వేగం మందగించి… ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాల ముందు లాక్‌డౌన్‌ కంటే మించిన పరిష్కార మార్గం కనిపించడం లేదు. ప్రజలు వైరస్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నట్టుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లాక్‌డౌన్‌ ద్వారా వ్యాప్తి వేగాన్ని తగ్గించగలిగితే… ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితులు మెరుగుపడతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కరోనా వ్యాప్తి తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్‌ అమలైంది. అప్పుడు చాలా మంది లాక్‌డౌన్‌ను వద్దనుకున్నారు. ఇప్పుడు కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తునర్నారు. అసలు అప్పుడు కాకుండా ఇప్పుడు పెట్టి ఉండాల్సిందనే వాదనలు ఉన్నాయి. కానీ, అప్పుడు లాక్‌డౌన్‌ విధించినందు వల్లే కేసులు వ్యాప్తి నెమ్మదించింది. లేకుంటే ఇప్పుడున్న కేసుల సంఖ్యను ఎప్పుడో చేరి ఉండదేని అంటున్నారు.

ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో మరోసారి లాక్‌డౌన్ దిశగా కేంద్రం ఆలోచన చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఇప్పటికే అలాంటి ఆలోచనలేవీ లేవన్నట్టుగా కేంద్రం స్పష్టం చేసేసింది. అంతే కాకుండా ఏ నిర్ణయమైనా రాష్ట్రాలు సొంతంగా తీసుకోవచ్చనట్టుగా సంకేతాలిచ్చింది. ఒకవేళ లాక్‌డౌన్‌ అమలు చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా నిర్ణయం తీసుకొని ముందుకు సాగవచ్చు. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకొని నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు రాష్ట్రాలకే ఇచ్చేసింది కేంద్రం. ప్రస్తుతం వివిధ మార్గాల్లో తిరుగుతోన్న రైళ్లను జులై 1 నుంచి నిలిపివేస్తున్నారు. ఆగస్టు 12 వరకూ ప్రయాణికుల రైళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. రైల్వే శాఖ నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ చర్యలు చేపట్టవచ్చనే చర్చ మొదలైంది. కానీ రాష్ట్రాలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ చేపట్టేందుకు ముందుకొస్తున్నాయి.

కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య కరోనా పేషంట్లతో నిండిపోవడం, కొత్త కేసులు వస్తే చికిత్స చేసేందుకు వైద్యులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో మరోసారి లాక్‌డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ అమలుతోనే పరిస్థితి చక్కబడుతుందని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రధాని మోడీకి ఇదే విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారు కూడా. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు రికవరీ అవుతారని, అలాగే వైరస్‌ వ్యాప్తి కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈసారి లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేస్తే మంచిదని భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసే సమయానికి కేసుల సంఖ్య తగ్గడంతో పాటు వైరస్‌ను నిరోధించే ఔషధాలు కూడా మార్కెట్లోకి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావచ్చని అంటున్నారు.